సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 27: అవసరమైనప్పుడు తన సినిమాల్లో తప్పకుండా అవకాశం కల్పిస్తానని జాతిరత్నాలు సినిమా డైరెక్టర్ కేవీ నవదీప్ విద్యార్థులకు హామీ ఇచ్చారు. స్థానిక తారా ప్రభుత్వ అటానమస్ కళాశాలలో రెండు నెలలుగా నిర్వహిస్తున్న షార్ట్ ఫిల్మ్ సర్టిఫికెట్ కోర్స్ ముగింపు కార్యక్రమం బుధవారం కళాశాల సెమినార్ హాల్లో నిర్వహించారు. కళాశాల ఫిల్మ్ క్లబ్ కన్వీనర్ మహేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నవదీప్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కోర్స్పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఆయన సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. హింసాత్మక సినిమాలు మినహా మిగతా అన్నిరకాల సినిమాలు తీసేందుకు ఇష్టపడతానన్నారు. తన సినిమాల్లో సహజ సిద్ధమైన డైలాగులు మాత్రమే ఉంటాయన్నారు.
విద్యార్థులు తమకు ఇష్టమైన విధంగా షార్ట్ ఫిల్మ్ చేయవచ్చని, అయితే వాటిలో హింసాత్మకమైన సంఘటనలు లేకుండా చూసుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు కళాశాలలో లఘు చిత్రాలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఆసక్తిగల విద్యార్థులు తాము చేసిన వీడియోలను తనకు పంపిస్తే వాటిని పరిశీలించి, అవకాశం వచ్చినప్పుడు సినిమాలోకి తీసుకుంటానని భరోసా ఇచారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన పలు షార్ట్ ఫిల్మ్‌లను ఆయన వీక్షించి వారిని అభినందించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉపేందర్ మాట్లాడుతూ సినిమా సమాజ మాధ్యమంగా అభివర్ణించారు.
సినిమాలు చాలా మందిని ప్రభావితం చేస్తాయని, విద్యార్థులు చదువులతో పాటు ఆసక్తి ఉన్నవారు సినిమాల్లో రాణించాలని ఆకాంక్షించారు. కళాశాల ఫిల్మ్ క్లబ్ కన్వీనర్ మహేశ్ మాట్లాడుతూ విద్యార్థులకు షార్ట్ ఫిల్మ్‌పై అవగాహన కల్పించడానికి కళాశాలలో ఫిల్మ్ క్లబ్ ఏర్పాటు చేశామని, అందుకు సహకరించిన కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ఏవీ శర్మ, అధ్యాపకులు రాపోలు శ్రీనివాస్, మనోజ్‌కుమార్, మంజుశ్రీ, నాగరాజు, సంతోషినీ, విద్యార్థులు పాల్గొన్నారు.