సంగారెడ్డి అర్బన్, డిసెంబర్ 17 : సంగారెడ్డి జిల్లాలోని ఎస్సీ హాస్టళ్లు ఆధునిక హంగులతో విద్యార్థులకు మరింత సౌకర్యవంతంగా తయారయ్యాయి. ఎస్సీ హాస్టళ్లలో వసతులు, మరమ్మతుల కోసం ప్రభుత్వం నుంచి క్రూషియల్ వెల్ఫేర్ ఫండ్ కింద నిధులు విడుదల అయ్యాయి. జిల్లాలో 47 సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లు ఉండగా, అందులో 38 సొంత భవనాలు, మరో 9 అద్దె భవనంలో నడుస్తున్నాయి. సొంత భవనంలో ఉన్న హాస్టళ్లలో మౌలిక సదుపాయాలైన తాగునీరు, నీటి సౌకర్యం, టాయిలెట్స్, శానిటేషన్, పైప్‌లైన్ నిర్మాణ పనులు చేపట్టేందుకు రూ.1.90 కోట్లతో నిధులు విడుదల చేశారు. ఒక్కో హాస్టల్‌కు రూ.5లక్షల చొప్పున నిధులను విడుదల చేశారు. వచ్చిన నిధులతో అన్ని హాస్టళ్లలో మరమ్మతు పనులు చేపట్టారు. 12హాస్టళ్లలో వంద శాతం పనులు పూర్తి కాగా, 24 హాస్టళ్లలో 90శాతం పనులు పూర్తి చేశారు. మరో రెండు హాస్టళ్లలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పనుల్లో జాప్యం జరుగుతున్నాయి. హాస్టల్ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సౌకర్యాలు కల్పించడంతో పాటు నూతనంగా టాయిలెట్లను నిర్మిస్తున్నారు. వెస్ట్రన్ టాయిలెట్స్‌ను అన్ని హాస్టళ్లలో ఒక్కోటి చొప్పున నిర్మించారు. తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లను ఆధునీకరించడం, నూతన పైప్లైన్ల నిర్మాణం, హాస్టళ్లకు కలరింగ్ పనులు చేపట్టారు. కార్పొరేట్ రెసిడెన్షియల్స్ తరహా సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఒక్కో హాస్టల్‌కు రూ.5లక్షలు..
తెలంగాణ ప్రభుత్వం హాస్టళ్లలో చదివే పేద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మరమ్మతుల కోసం ఒక్కో హాస్టల్‌కు రూ.5లక్షల నిధులను విడుదల చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాల హయాంలో హాస్టళ్లలో చదివే విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించిన పాపాన పోలేదు. కానీ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం వడ్డించడంతో పాటు వారానికి ఒక రోజు కోడి కూర వడ్డిస్తూ ప్రైవేట్ హాస్టళ్లను తీసిపోయేలా చర్యలు తీసుకున్నారు. హాస్టళ్లలో సమస్యల పరిష్కారం కోసం జిల్లాకు రూ.కోటి 90లక్షల నిధులు విడుదల చేశారు. ఒక్కో హాస్టల్‌కు రూ.5లక్షలు కేటాయించి అందులో రూ.లక్షతో విద్యుత్ మరమ్మతులు, కొత్త కనెక్షన్లు వేయడం, మరో రూ.2లక్షలతో మరుగుదొడ్ల మరమ్మతు, కొత్తవి నిర్మించడం, శానిటేషన్ చేయడం, ఇంకో రూ.2లక్షలతో విద్యార్థులకు నీటి వసతి కల్పించడంతో పాటు తాగునీరు అందించడం, పైపులైన్ నిర్మించడం వంటి పనులకు ఉపయోగిస్తున్నారు.
90శాతం పనులు పూర్తి..
హాస్టళ్ల మరమ్మతులకు ప్రభు త్వం జిల్లాకు రూ.1.90 కోట్లను మార్చి నెలలోనే విడుదల చేసింది. అప్పుడు కరోనా ఉండడంతో పనులు చేయలేకపోయాం. ఒక్కో హాస్టల్‌కు రూ.5లక్షలు వచ్చాయి. అందులో నుంచి విద్యుత్ కనెక్షన్లు, వాటి రిపేర్లు, తాగునీరు, విద్యార్థులు వాడుకునే నీటి వసతి, మరుగుదొడ్ల నిర్మాణం పనులు చేపట్టాం. ఇప్పటికే 12హాస్టళ్లలో వందశాతం పనులు పూర్తయ్యాయి. మరో 26 హాస్టళ్లలో 90 శాతం పనులు పూర్తి కాగా, మరో రెండు మునిపల్లి, మల్లేపల్లి హాస్టళ్లలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పనుల్లో జాప్యం జరిగింది. ఈ నెలాఖరు వరకు అన్ని హాస్టళ్లలో వంద శాతం పనులు పూర్తి చేస్తాం.
కార్పొరేట్‌కు దీటుగా సౌకర్యాలు..
కార్పొరేట్‌కు దీటుగా హాస్టళ్లలో ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తున్నది. ప్రతి హాస్టల్‌కు రూ.5లక్షలు విడుదల చేసింది. వాటితో మా హాస్టల్లో మరుగుదొడ్లు, హాస్టల్లో వైరింగ్, కిచెన్ మరమ్మతులు చేయించాం. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వెస్ట్రన్ టాయిలెట్స్ నిర్మించాం. విద్యార్థులకు రెండు జతల యూనిఫాం, నైట్ డ్రెస్, బ్లాంకెట్లు, స్వెట్టర్లు, మరో రెండు జతల బట్టలు అందజేశాం.