ఝరాసంగం, మే 2: ఝరాసంగం మండలంలోని ఎల్గోయి గ్రామానికి గత ఐదు రోజులుగా సాగు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు తీవ్ర ఆవేదనతో స్థానిక సబ్స్టేషన్ ఎదుట నిరసనకు (Farmers Protest) దిగారు. 42 డిగ్రీల తీవ్ర ఎండల మధ్య ఒక్క రోజు సాగునీరు అందించలేక పోతే పొలాలు మంటలు కక్కుతున్నట్లు కనిపిస్తున్నాయన్నారు. పొలాల్లో పని చేస్తున్న కూలీలకు ఇంటి నుంచే తాగునీరు తీసుకొచ్చి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందనీ ఆవేదన వ్యక్తం చేశారు. లైన్మెన్కు ఫోన్ చేసినా స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏఈకి ఎన్నిసార్లు ఫోన్ చేసిన కనీసం ఒక్కసారికూడా స్పందించలేదని, ఇలా అయితే వ్యవసాయం ఎలా సాగుతుందని మండిపడ్డారు.
విద్యుత్ శాఖ అధికారులు అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణిని ఖండిస్తూ ‘ఈ లైన్మెన్ మాకొద్దు’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. రూ.లక్షలు ఖర్చుపెట్టి పంట వేశామని, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో తమకు కన్నీరే మిగిలేటట్టు ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించకపోతే, జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసనలో అశోక్, అంజన్న, శేఖర్, యేసయ్య, ప్రభు, జానుమియ, మక్బూల్, విఠల్, విశ్వనాథం, నగేష్, వెంకన్న, సిద్ధన్న, రాములు, రైతులు పాల్గొన్నారు.