గుమ్మడిదల, మే13: ప్యారానగర్ డంపింగ్‌యార్డును (Pyaranagar Dumping Yard) రద్దు చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోగా ఊర్లను వదిలి పోయేలా చేస్తుందని రైతు జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారంతో 98 రోజులుగా డంపింగ్‌యార్డు (MSW)కు వ్యతిరేకంగా చేస్తున్న రిలే నిరాహారదీక్షలో రైతు జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డంపింగ్‌యార్డును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకానీ ఊర్లు వదిలిపోవలిసి వస్తే రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గద్దేదిగేవరకు పోరాడుతామని హెచ్చరించారు.
ఇన్నాళ్లుగా ప్యారానగర్ డంపింగ్‌యార్డుపై ఎందుకు నిర్ణయం తీసుకుంటలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లవల్లి, ప్యారానగర్, కొత్తపల్లి గ్రామాల ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం వంచన చేస్తున్నదని ఆరోపించారు. ఇక ఉపేక్షించవలసిన పని లేదని ఉద్యమాన్ని కొనసాగిస్తామని, ఊపిరి ఉన్న వరకు నిరాహారదీక్షలు చేస్తామని హెచ్చరించారు. వెంటనే డంపింగ్‌యార్డును రద్దు చేయాలని లేదంటే ఇక ఊపిరి ఆగే వరకు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతుందని హెచ్చరించారు. ఇందులో రైతు జేఏసీ నాయకులు, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.