Dumping Yard | గుమ్మడిదల, జూన్13: డంపింగ్యార్డు నుంచి పచ్చని పర్యావరణాన్ని రక్షించాలని రైతు జేఏసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్ గ్రామశివారులో ఏర్పాటు చేయబోయే డంపింగ్యార్డు వల్ల పర్యావరణంతో పాటు భూగర్భజలాలు, వ్యవసాయ పంట పొలాలు కలుషితమవుతాయని రైతు జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అడవుల్లో ఉండే వృక్షజాతి, వన్యప్రాణులకు సంకటంగా మారుతుందని తెలిపారు. ఈ విషయాలను రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లిన రైతు జేఏసీ నాయకులు.. డంపింగ్ యార్డు ఏర్పాటుకు ఇచ్చిన అనుమతులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
గుమ్మడిదల మండలంలో డంపింగ్ యార్డు ఏర్పాటును నిరసిస్తూ రైతు జేఏసీ నాయకులు చేపట్టిన రిలే నిరాహారదీక్ష శుక్రవారానికి 129వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. శాంతియుతంగా దీక్షలు చేస్తున్నా రాష్ట్ర పాలకవర్గం స్పందించకపోవడం సరికాదని అన్నారు. వెంటనే స్పందించి డంపింగ్యార్డు(ఎంఎస్డబ్ల్యూ)ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.