నిజాంపేట్, సెప్టెంబర్ 9: సీజన్ మార్పులతో వచ్చే వ్యాధులు (Seasonal Diseases) దరిదాపులకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని నిజాంపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని తరిణి అన్నారు. ప్రతి ఏటా వచ్చే సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇంటి ఆవరణలో మొలిచిన పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రంగా ఉంచాలని సూచించారు. అలాగే ఇంట్లోని మొక్కలను పెంచే తొట్లలో నిలువ ఉన్న నీటిని శుభ్రం చేసుకొని ఉంచాలన్నారు. ఇంటి పరిసరాలలో ఎలాంటి చెత్తాచెదారం లేకుండా ఉంటే వ్యాధులను నివారించవచ్చని ఆమె తెలిపారు.
వీలైనంత వరకు ఇంటి పరిసరాలలో మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. మురుగునీరు నిలువ ఉన్నట్లయితే ఆచోట్ల దోమలు చేరి వ్యాధులు ప్రభలే అవకాశం ఎంతైనా ఉందన్నారు. పిచ్చి మొక్కలను తొలగించి, తులసి మొక్కలను పెంచినట్లయితే దోమలను నివారించవచ్చని సూచించారు. మనం నిత్యం తినే ఆహార పదార్థాలను బయట నుంచి తీసుకువచ్చిన కూరగాయలను శుభ్రంగా కడుక్కొని నిలువుంచుకోవాలన్నారు. ప్రస్తుతం వస్తున్న ఈ సీజన్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ఇంటింటికి తాండాలలో తమ సిబ్బంది ఏఎన్ఎంతోపాటు ఆశ వర్కర్లను పంపించి సీజన్లో వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తూ ఉన్నామన్నారు. విష జ్వరాల పట్ల వ్యాధి బారిన పడిన వారికి తగిన మందులు ఇంజక్షన్లు ఇస్తూ మిగతా వారికి స్థానిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి డాక్టర్ను సంప్రదించాలని సూచించారు.