మునిపల్లి, జూన్ 13: గ్రామాల్లో చెత్తా.. చెదారం నిండిపోవడంతో దుర్వాసన వేదజల్లడంతో ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నట్లు గమనించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో డంపింగ్ యార్డుల (Dumping Yard) నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. పంచాయతీ సిబ్బంది గ్రామంలోని ఇంటింటికీ తిరిగి సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుల్లో వేసేవారు. అయితే డంపింగ్ యార్డుల వినియోగం బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ముగిసినట్లు అధికారుల తీరు కనిపిస్తుందని స్థానికులు విమర్శిస్తున్నారు. అధికారులు పర్యవేక్షణ కరువవడంతో గ్రామాల్లో ఇష్టం వచ్చిన దగ్గర చెత్తను వేస్తూ రోగాలకు స్వాగతం పలుకుతున్నట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత అధికారులు స్పందించి మునిపల్లి- చెందాపూర్ గ్రామాలకు వెళ్లే రోడ్డు పక్కన వేస్తున్న చెత్తను తొలగించి, మునిపల్లి గ్రామ శివారులో నిర్మాణం చేపట్టిన డంపింగ్ యార్డ్లో వేసేల చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.