కోహీర్, మే13: పంటల సాగులో అధిక దిగుబడులు సాధించి రైతులందరూ ఆభివృద్ధి చెందాలని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ విజయలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం కోహీర్ మండలంలోని గొటిగార్‌పల్లి రైతు వేదికలో పలు గ్రామాల రైతులతో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ముందుగా భూసార పరీక్షలు నిర్వహించి అనుకూలమైన పంటలను మాత్రమే సాగు చేయాలని కోరారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడంతో పాటు సాగు ఖర్చును కూడా ఆదా చేయాలని సూచించారు.
డ్రిప్పు పైపుల ద్వారా సాగునీటిని అందిస్తే నీరు ఆదా అవుతుందన్నారు. పంటలను పండించి వ్యాపారం చేసేందుకు ప్రణాళికలను తయారు చేసుకోవాలని సూచించారు. టమాట సాస్, టమాట పచ్చడి, అల్లం పేస్టును తయారు చేసి విక్రయిస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. రైతులందరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో శాస్త్రవేత్తలు రాజేందర్, శ్రీనివాసులు, ఏడీఏ భిక్షపతి, ఏవో నవీన్‌కుమార్, ఏఈవోలు స్వాతిరెడ్డి, మౌనికవర్మ, సంధ్య, సవిత, చరణ్ పాల్గొన్నారు.