మెదక్, జనవరి 20(నమస్తే తెలంగాణ): ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న మాజీ మంత్రి హరీశ్ రావుపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే సిట్ నోటీసులు పంపించారని దేవీప్రసాద్ విమర్శించారు. హరీశ్‌రావుపై ప్రభుత్వ కుట్రలను ఎదిరిద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పసలేదని, సాక్షాత్తు సుప్రీంకోర్టునే ఈ కేసు కొట్టేసిందని తెలిపారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును అమలు చేయకుండా, హరీశ్‌రావుకు నోటీసులు ఇవ్వడం చూస్తుంటే.. రేవంత్ రెడ్డి సర్కార్‌కు న్యాయవ్యవస్థ పట్ల గౌరవం లేదని తేలిపోయిందని అన్నారు.
నైనీ బ్లాక్ బొగ్గు గనుల కేటాయింపుల వ్యవహారంలో సృజన్ రెడ్డి కుంభకోణాన్ని బయటపెట్టిన వెంటనే, దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని దేవీప్రసాద్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు ప్రజల కష్టాల్లో తోడున్న నాయకుడు హరీశ్‌రావు అని తెలిపారు. అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడుతున్నారని పేర్కొన్నారు. అందుకే రాజకీయంగా హరీశ్‌రావును, బీఆర్ఎస్ను ఎదుర్కోలేక ఇలాంటి తప్పుడు కేసులతో ఇబ్బందిపెట్టాలని చూస్తున్నారని అన్నారు.
రెండేండ్ల దారుణమైన పాలనను నిలదీస్తుండటంతో హరీశ్‌రావును టార్గెట్ చేసి, మానసిక ఆనందం పొందుతున్నారని దేవీప్రసాద్ విమర్శించారు. చట్టంపైనా, న్యాయస్థానాలపైనా తమకు పూర్తి గౌరవం ఉందని తెలిపారు. అందుకే ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.అక్రమ కేసులు, విచారణల పేరుతో, నోటీసులతో ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కాలని అనుకుంటే అది మీ భ్రమ మాత్రమే అని అన్నారు.. మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎన్ని వేధింపులకు గురిచేసినా ప్రజల పక్షాన మా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని.. అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.