జహీరాబాద్, మార్చి 6 : జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లోని గ్రామ పంచాయతీలకు నిధుల కొరత కారణంగా గ్రామాల్లో సమస్యలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. ఇంతకాలం చిన్న చిన్న ఖర్చులకు జేబుల్లో నుంచి వెచ్చించిన పంచాయతీ కార్యదర్శులు.. ఇక తమ వల్ల కాదంటూ చేతులెత్తేశారు. దీంతో గ్రామాల్లో వీధి దీపాలు వెలుగకపోయిన, బోరు పని చేయకపోయిన, ట్రాక్టర్లలో డీజిల్ లేకపోయినా వాటి ఫలితం ప్రజలు అనుభవించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతకాలం కార్యదర్శులు సొంతంగా వెచ్చించిన ఖర్చులు తిరిగి రాకపో గా, నగదు చెల్లించకుండా సామగ్రిని ఇచ్చేందుకు షాపుల నిర్వాహకులు నిరాకరిస్తుండడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచి పోయే పరిస్థితులు నెలకొన్నాయి
గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడం లేదు. గ్రామ పంచాయతీల్లో పాలక వర్గాలు లేనందున నిధులు విడుదల చేయలేమంటూ కేంద్రం చేతులెత్తేసింది. సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఉంటే కేంద్రం నిధులు సక్రమంగా విడుదలై ఉండేవి. పంచాయతీ పాలక వర్గాల గడువు ముగిసి దాదాపు రెండేళ్లు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడంలో తాత్సారం చేస్తోంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తేనే 15వ ఆర్థిక సంఘం ద్వారా నిధులను రిలీజ్ చేస్తామని కేంద్రం లంకె పెట్టడంతో ఆ నిధులపై ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కమిషన్ (ఎస్ఎఫ్సీ) కింద నిధులను విడుదల చేయకపోవడంతో గ్రామాల్లో నిధుల కొరత తీవ్ర రూపం దాల్చింది. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు నిలిపివేయగా సొంతంగా గ్రామపంచాయతీలు జమ చేసుకున్న ఫండ్‌ను కూడ వినియోగించుకోలేని ధీనమైన పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామాల్లో వివిధ పనులు చేపట్టేందుకు అవసరమైన డబ్బుల కోసం చెక్కులు డిపాజిట్ చేస్తే పాస్ కావడం లేదని చెబుతున్నారు. ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకపోగా, మరోవైపు తాము వసూలు చేసి డిపాజిట్ చేసిన సొమ్ము ఫ్రీజ్ కావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. పంచాయతీల్లో పాలకవర్గం కాలపరిమితి ముగిసిన నాటి నుంచి రోజువారి పారి శుధ్యం, ట్రాక్టర్లలో డీజిల్ పోయించడం, వాటికి మరమ్మతులు, బ్లీచింగ్, బయోటెక్స్, ఫాగింగ్, తదితర సామగ్రి కోసం దుకాణాల్లో ఖాతాలు పెట్టామని, మళ్లీ సామగ్రి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని పేర్కొన్నా రు. పెండింగ్‌లో ఉన్న చెక్కులను వెంటనే క్లియర్ చేయించడంతో పాటు ట్రెజరీకి అనుసంధానం లేకుండా నేరుగా చెల్లింపులు జరిపేందు కు చర్యలు తీసుకోవాలని జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండల అభివృద్ధి అధికారులకు పంచాయతీ కార్యదర్శులు వినతి పత్రాలను అందజేశారు. ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లో సమస్యలు జఠిలం కా కుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.