అమీన్పూర్, జనవరి 2: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ భగిరథ పథకం ద్వారా అందిస్తున్న నీటితో పటాన్చెరు నియోజక వర్గంలో నీటి కష్టాలు తీరనున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేట్ పంచాయతీలో వెంకటరమణకాలనీ,లక్ష్మీనగర్ కాలనీలో జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ సీఎస్ఆర్ నిధులతో సుమారు 70 లక్షల రుపాయాల అంచనా వ్యయంతో సీసీరోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జానకంపేట్ గ్రామంలో 20లక్షలతో మిషన్ భగీరథ పథకం ద్వారా వాటర్ ట్యాంక్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో నీటి కష్టాలను గుర్తు చేసుకుంటే బాధ కల్గిస్తాయని, ఇప్పుడు ఆ పరిస్థితుల నుంచి పూర్తిగా దూరమయ్యామని అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ మండల పరిధిలో వెలుస్తున్న నూతన కాలనీలలో సైతం తాగునీరు, రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, సర్పంచులు ఏర్పుల కృష్ణ, పాండుయాదవ్, బీఆర్ఎస్ నాయకులు సుల్తాన్పూర్ రాజు పాల్గొన్నారు.