మునిపల్లి, ఆగస్టు 30: ఈ ఫొటోలో ఉన్నది కాంగ్రెస్ (Congress) పార్టీ ఆఫీస్ కాదు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే పాఠశాల (KGBV). మరి ఇదేంటి అన్ని కాంగ్రెస్ కటౌట్లు, ఫ్లెక్సీలు ఉన్నాయని అనుకుంటున్నారా. అది నాయకులు, ఆ పాఠశాల సిబ్బంది అలసత్వం. మంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన కటౌట్లను తీయకపోవడంతో పార్టీ కార్యాలయాన్ని తలపిస్తున్నది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈనెల 22న మునిపల్లి (Munipally) మండలంలోని తాటిపల్లిలో పర్యటించిన మంత్రి దామోదర రాజనర్సింహ గ్రామ శివార్లలోని కస్తూర్బా గాంధీ (KGBV) పాఠశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మంత్రి రాక సందర్భంగా పాఠశాల గేటుకు రెండు వైపులా కాంగ్రెస్ నాయకులు భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. మంత్రి పర్యటన ముగిసి వారం రోజులు కావస్తున్నా ఇప్పటికీ వాటిని తొలగించలేదు. దీంతో గ్రామస్తులతోపాటు, అటుగా పోయేవారు పార్టీ నాయకులు, పాఠశాల సిబ్బంది తీరుపై మండిపడుతున్నారు. ఇది స్కూలా లేక కాంగ్రెస్ పార్టీ కార్యాలయమా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను చూసేందుకు వస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ప్రిన్సిపల్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పాఠశాల ముందు ఏర్పాటు చేసిన బ్యానర్లను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.