సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : ఆహారం కోసం ఆర్డర్ చేస్తున్నారా? నచ్చిన ఐటెం తినాలని ఊవిళ్లూరుతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. నగరంలోని పలు పేరు మోసిన హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్ కొరత నష్టాలను వినియోగదారులపై మోపుతున్నాయి. ఇటీవల నగరంలో గ్యాస్ సిలిండర్ కొరత తీవ్రమవ్వడంతో చాలా రెస్టారెంట్లు హోటళ్లు తమ మెనూలోని కొన్ని ఆహార పదార్థాలను తగ్గించాయి. అయితే ఉన్న వాటిలోనూ వేలాది మందికి సర్వ్ చేసే ఐటెంల్లో చికెన్, మటన్, వెజ్ బిర్యానీలను గతంలో కంటే తక్కువ క్వాంటిటీని సర్వ్ చేస్తున్నాయి. అయితే ఇందులోనూ సగం ఉడికిన బిర్యానీలనే కస్టమర్లకు వడ్డిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
చాలా మంది కస్టమర్లు వద్దని వదిలేసిన బిర్యానీలు సైతం డెలివరీ రూపంలో నగరవాసుల ఇంటికి చేరుతున్నాయి. ఇటీవల స్విగ్గీ, జొమాటోలకు ఆహార పదార్థాల నాణ్యత బాగా లేదని వేలాది ఫిర్యాదులు ఈ వారం రోజుల్లో అధికంగా చేయడం గమనార్హం. వారాసిగూడకు చెందిన ఓ కస్టమర్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఓ బిర్యానీ ఆర్డర్ పెట్టగా.. అందులో పీస్ సగం తినేసినట్టుగా ఉంది. దీంతో అవాక్కయిన ఆ కస్టమర్ స్విగ్గీకి గ్యాస్ సిలిండర్ కొరత ఆహార రంగాన్ని తీవ్రంగా కబళిస్తున్నది. కమర్శియల్ గ్యాస్ ధరలు రూ.3 వేల నుంచి 5 వేల వరకు పలుకుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో వారి నష్టాలను పూడ్చుకోవడం కోసం కొన్ని హోటల్స్, రెస్టారెంట్లు కస్టమర్లను ప్రమాదంలో పడేస్తున్నాయి. మరోవైపు రోడ్ సైడ్ ఫుడ్ కూడా ఇప్పుడు డిమాండ్ పలుకుతున్నది. రూ.15, 20, 30కి దొరికే టిఫిన్స్, ఇతర స్నాక్స్ ఐటెంలు రూ.15 పెరిగాయి. మహిళలు ఇష్టంగా తినే కట్లెట్ ధరలు సైతం రూ.10 పెరిగాయని కస్టమర్లు చెబుతున్నారు. ఉడిపి హోటల్స్ మెనూలోని ధరలకు భిన్నంగా రూ.15 అధికంగా వసూలు చేస్తున్నాయి. మొత్తంగా ఫుడ్ రంగంలో చాలా వరకు వారి నష్టాలను కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. ధరల పెంపు పక్కనపెడితే మిగిలిన ఆహారాన్ని పార్సిళ్లుగా పంపి కస్టమర్లను మోసం చేయడంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు. హోటల్స్‌లోని నో అడ్మిషన్ గదుల్లో ఏం జరుగుతుందో తెలియకుండానే కస్టమర్లు వారు ఏది పెడితే అది తినాల్సిన దుస్థితి ఉందని వాపోతున్నారు.