సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ): ఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ భూగర్భ కేబుల్ పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం చాలాచోట్ల యూజీ కేబుల్ పనులు జరుగుతున్నాయి. అవకాశం ఉన్నచోట అంటే చాలా కొద్ది ప్రాంతాల్లో ఓహెచ్ తొలగించి యూజీలను వేసే పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఈ పనుల్లో అసలు నాణ్యతే లేకుండా పోతున్నదని, కేబుల్స్ అండర్‌గ్రౌండ్‌లో పదిలంగా ఉండేలా వేయాల్సిన చోట కొందరు అధికారుల కక్కుర్తి, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న యూజీ ఏర్పాటు ప్రక్రియలో నాణ్యత కరువైందని కొందరు విద్యుత్ అధికారులే చెబుతున్నారు.
పరిధిలో పది సర్కిళ్లు ఉండగా కొన్ని చోట్ల జరుగుతున్న అండర్‌గ్రౌండ్ కేబుల్స్ పనుల్లో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. భద్రంగా మీటర్ లోతులో వేయాల్సిన తీగలను ఫీట్ లోతులో మాత్రమే వేస్తూ నాణ్యతకు పాతరేస్తున్నారు. నాసిరకం పనులపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. గాలి వీచినా, వర్షం పడినా కరెంట్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండవద్దని ఒక సబ్‌స్టేషన్ నుంచి మరొక సబ్‌స్టేషన్‌కు 33కేవీ, ఒక ఫీడర్ నుంచి మరో ఫీడర్‌కు 11కేవీ విద్యుత్ తీగలు వేస్తున్నారు.
అండర్ గ్రౌండ్ కేబుల్స్‌ను విద్యుత్ స్తంభాలకు, రింగ్ యూనిట్లకు కనెక్ట్ చేసే క్రమంలో పనుల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నదని స్థానికులు చెబుతున్నారు. ప్రధానంగా యూజీ కేబుల్స్‌ను కేవలం ఫీట్లోతులోనే వేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. విద్యుత్ పనుల కోసమే అదే ప్రాంతంలో తవ్వకాలు జరిపినప్పుడు కేబుళ్లు తెగి కరెంట్ షాక్ వచ్చిన ఘటనలు ఉన్నాయి. అంతేకాకుండా సరఫరాలోనూ అనేక అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఇదిలా ఉంటే కందికల్ ఫ్లైఓవర్ వాల్ సైడ్ నుంచి దుర్ధన హోటల్ భారత్ పెట్రోల్ పంపు వరకు ఫలక్‌నుమాలో ట్రాన్స్ఫార్మర్కు సంబంధించిన యూజీ కేబుల్ పనులు జరుగుతున్నాయి. ఇందులో 11కేవీ ఫీడర్‌కు సంబంధించి అడుగు మేరకే తవ్వి వేయడంతో కేబుల్స్ రోడ్డుపైకి తేలి కనిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం 0.9 నుంచి 1 మీటర్ లోతు తవ్వాలి. అడుగు భాగంలో తేలితే నిరోధం కోసం ఇసుక వేయాలి. కేబుల్ వేశాక బండలు వేయాలని అధికారులు చెబుతున్నారు. కానీ నగరంలో ఎక్కడా అటువంటి పరిస్థితే లేదు. పలుచోట్ల జరుగుతున్న యూజీ పనుల్లో ఇసుక జాడే లేదు.
ఇదిలా ఉంటే రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్‌సిటీని స్తంభాలు లేని నగరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు వేస్తున్నప్పటికీ కేబుల్ మార్చడం మాత్రం చాలా కష్టమని అధికారులు అంటున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న 765కేవీ, 400కేవీ, 220కేవీ వంటి హైటెన్షన్ విద్యుత్ లైన్లున్నాయి. వీటిని ఆధునిక సాంకేతికతతో అండర్‌గ్రౌండ్‌కు మార్చాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినా అది సాధ్యం కాదని అధికారుల తేల్చిచెప్పారు. మీర్ఖాన్పేటలో ఉన్న పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌కు చెందిన 765/400జీఐఎస్ సబ్‌స్టేషన్ ఉంది. వీటి తీగలే ప్రధానంగా ప్యూచర్సిటీలో విస్తరించి ఉన్నాయి.
సౌత్ఇండియా గ్రిడ్‌కు అనుసంధానంగా ఉన్న ఈ తీగలు పొరుగు రాష్ర్టాల నుంచి వచ్చే విద్యుత్‌ను క్రమబద్ధీకరించేందుకు వినియోగిస్తున్నారు. అయితే చత్తీస్గడ్, కర్ణాటక నుంచి వచ్చిన 765 కేవీ విద్యుత్‌ను ఇక్కడ స్టెప్‌డౌన్ చేసి ఆ తర్వాత 400కేవీ, 200కేవీ లైన్ల ద్వారా నగరానికి, తెలంగాణలోని పలు ప్రాంతాలకు పంపిణీ చేస్తున్నారు. ఈ భారీ వోల్టేజీ లైన్లను భూగర్భంలోకి మార్చడం పెద్ద సవాల్ అని అధికారులు చెప్పారు.