హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): గవర్నర్ నోటితో అబద్ధాలు చెప్పించినందుకు ఈ ప్రభుత్వానికి అభినందన కాదు.. అభిశంసన చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్డారు. ఐఐటీకీ, ట్రిపుల్ఐటీకి తేడా తెలియని సీఎం.. బ్లూ కాలర్ జాబ్ ఇప్పిస్తాననడం సిగ్గుచేటని ఎద్దేవాచేశారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం బుధవారం రాత్రి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ప్రసంగంలో సరుకు, సబ్జెక్టు లేదని కేటీఆర్ విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో గ్యారెంటీల ప్రస్తావన లేదు కానీ సెల్ఫ్ డబ్బా ఉన్నదని మండిపడ్డారు. 420 హామీలు ఇచ్చిన చోర్ దేశంలో ఎకడా లేదని విమర్శించారు. ఆరు గ్యారెంటీల హామీ ఫైల్ ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌లో కాలిపోయిందేమో అనుకున్నామని, కానీ ఓటుకు నోటు దొంగ ఎత్తుకుపోయాడని ఇప్పుడు తెలిసిందని పేర్కొన్నారు. మానసికస్థితి సరిగా లేని ముఖ్యమంత్రిని ఇంకా రెండున్నరేండ్లు తెలంగాణ ప్రజలు ఎలా భరించాలని ప్రశ్నించారు.
కేరళ ఎన్నికల నిధుల కోసం దోపిడీ ప్రణాళికకు తెరలేపారని విమర్శించారు. పేదల ఇండ్లు కూల్చారు తప్ప, ఒక ఇటుకపెట్టి ఒక ఇల్లు కట్టలేదని మండిపడ్డారు. మూడు పంటలకు బోనస్ వేస్తామని చెప్పి మార్చి నెల వచ్చినా ఎందుకు వేయలేదని కేటీఆర్ నిలదీశారు. రైతుబంధు రైతుల ఖాతాలో వేసినవా? రాహల్‌గాంధీ ఖాతాలో వేసినవా? అని ప్రశ్నించారు. రైతుబంధు రాహుల్బంధుగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. బూతుల వరద తప్ప సీఎం ప్రసంగంలో ఏమీలేదని మండిపడ్డారు. రూ.16 వేల కోట్లు ఖర్చు అయ్యే మూసీ ప్రక్షాళనకు లక్షన్నర కోట్లు ఎందుకని నిలదీశారు. మూసీపై కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి మాదిరిగా కేసీఆర్ హయాంలోనే ఎస్టీపీ కట్టారని తెలిపారు. కేసీఆర్ గోదావరి నీళ్లు పొలాలకు మళ్లించారని, డబుల్ బెడ్రూం ఇండ్లు కూడా కేసీఆరే కట్టించారని గుర్తు చేశారు.
అసెంబ్లీలోనూ బుల్డోజ్
హైడ్రా పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పేదల ఇండ్లు కూల్చుతున్న రేవంత్ సర్కార్.. అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష సభ్యులు మాట్లాడకుండా బుల్డోజ్ చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్ని విషయాల గురించి మాట్లాడుదామంటే తమకు మైక్ ఇవ్వకుండా సభను వాయిదా వేసుకొని వెళ్లిన సన్నాసి రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. సర్కార్ నడుపుతున్నామనే సోయిలేకుండా వీధిరౌడీ మాదిరిగా, రౌడీ దర్బారు తరహాలో రేవంత్ మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎవరిని తొక్కి వచ్చినవ్ రేవంత్‌రెడ్డీ.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని, శ్రీధర్‌బాబును, దామోదర రాజనర్సింహను తొక్కినవని విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి వీధిరౌడీ కంటే హీనంగా మాట్లాడినందున తెలంగాణ సమాజం తలదించుకుంటున్నదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సాక్షిగా వీధిరౌడీలా ప్రవర్తించినందుకు తక్షణమే రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని, స్పీకర్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ముఖ్యమంత్రి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
రాక్షసజాతి నీది… రేవంత్
రేవంత్‌రెడ్డిది రాక్షసజాతిగా కేటీఆర్ అభివర్ణించారు. అర్జునుడి కన్ను చిలక మీద ఉన్నట్టు రేవంత్ కండ్లు భూములు మీద ఉన్నాయని అన్నారు. రియల్ఎస్టేట్ బ్రోకర్ అయిన రేవంత్‌రెడ్డి కండ్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ భూములపై పడ్డాయని విమర్శించారు. ‘మేము మిషన్ కాకతీయలో 30 వేల చెరువులు అభివృద్ధి చేశాం. మీరు మూడు చెరువులు అభివృద్ధి చేసి డబ్బా కొట్టుకుంటున్నారు. కేసీఆర్ చేసిన అప్పు రూ.2.8 లక్షల కోట్లు అని కేంద్రం చెపితే, రూ.8 లక్షల కోట్లు అని అబద్ధాలు మాట్లాడుతున్నారు. తొమ్మిదేండ్లలో కేసీఆర్ చేసిన అప్పు రేవంత్‌రెడ్డి రెండేండ్లలో చేశారు’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి చేసిన రూ.3.5 లక్షల కోట్ల అప్పుతో ఒక్క పేదవాడికైనా న్యాయం జరిగిందా? రైతన్నలకు రైతుబంధు వచ్చిందా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ కాలిగోటికి సరితూగవు
తమను ఎన్ని తిట్టినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భరిస్తాం.. కానీ, నీ దోపిడీని మాత్రం అడ్డుకుంటామని కేటీఆర్ స్పష్టంచేశారు. సీఎం సంసారంతో మాట్లాడితే తాము కూడా సంసారంగా మాట్లాడుతామని చెప్పారు. అనుముల దండుపాళ్యం ముఠా దోపిడీని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకో రేవంత్‌రెడ్డీ.. అని హెచ్చరించారు. ‘చిలక్కొట్టుడు. ఆర్టీఐల పేరిట బ్లాక్మెయిల్ చేసిన నాయకుడు కాదు కేసీఆర్. ఆయన కాలిగోటికి సరితూగవు. నీ వాగుడు తెలంగాణ సమాజం మొత్తం చూసింది. నిన్ను ఛీకొట్టే రోజులు, అసహ్యించుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. గజదొంగను నిరోధిస్తాం. ప్రజల తరఫున కొట్లాడుతాం’ అని చెప్పారు. రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో ఓడిపోలేదా? అని ప్రశ్నించారు. 2029లో మళ్లీ అధికారంలోకి రావడం కాదు.. ఇంకో రెండేండ్లు తెలంగాణ ప్రజలు రేవంత్‌రెడ్డిని భరించడమే ఎకువ అని అన్నారు. మూసీ మీద ఉన్న ప్రేమ పాలమూరు బిడ్డనని చెప్పుకొనే సీఎంకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఎందుకు లేదని నిలదీశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ఒక్క మాటయినా తీసిండా? పాలమూరు బిడ్డవైతే 90% పూర్తయిన పనులకు నిధులిచ్చి పూర్తిచేయాలని సవాల్ విసిరారు.
అశోక్‌నగర్ వెళ్తే బట్టలిప్పి కొడతరు
తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తాము ఇచ్చిన నోటిఫికేషన్లకు 11 వేల ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఉద్యోగాల కల్పన విషయంలో అశోక్‌నగర్ వస్తవా? నిరుద్యోగులను ఫేస్ చేస్తవా? అని ప్రశ్నించారు. అశోక్‌నగర్ వస్తే బట్టలతో మీరు వచ్చే పరిస్థితి లేదని, ఆరు నెలల్లో పీఆర్సీ ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదని, గవర్నర్ ప్రసంగంలో దాని ప్రవస్తాన లేదని మండిపడ్డారు. జీతం నుంచి దాచుకున్న డబ్బులు అందక రిటైర్డ్ ఉద్యోగులు చనిపోతున్నారని, గురుకులాల్లో విద్యార్థులకు కడుపునిండా భోజనం పెట్టడం లేదని, చాలామంది పిల్లలు వివిధ కారణాలతో చనిపోయారని, ఈ అంశాల గురించి ఎందుకు గవర్నర్ ప్రసంగంలో చేర్చలేదని ప్రశ్నించారు. మూడు రోజులు హార్వర్డ్‌కు వెళ్లి ప్రజాధనం రూ.3 కోట్లు ఖర్చు పెట్టిన రేవంత్‌రెడ్డి.. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.
ఫ్రీ బస్సు తప్ప అంతా తుస్సు
ఫ్రీ బస్సు తప్ప అంతా తుస్సు అని, ఆరు గ్యారెంటీలకు పాతర, డిక్లరేషన్లకు మంగళం పాడరని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది బడ్జెట్ సెషనా, లేక కాంగ్రెస్ డబ్బానా అర్ధం కాలేదని మండిపడ్డారు. రైతన్నలకు రూ.28 వేల కోట్లు బాకీ ఉన్నారని చెప్పారు. ప్యూర్, రేర్ కాదు చోర్ మాటలు.. ఇది బడ్జెట్ సెషనా.. గాంధీభవన్ వర్క్షాపా? అని ఎద్దేవా చేశారు. గాంధీభవన్ స్పీచ్ అసెంబ్లీలో కొడితే ఎలా అని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ అయినా సీఎం స్పీచ్‌పై స్పందించాలని హితవు చెప్పారు. గ్యారెంటీలు ఏమీ అమలుచేయకుండా చెప్పుకోవడానికి ఏమీ లేదని అన్నారు. ఏఐతో వైట్‌కాలర్ జాబ్‌లు పోతాయని, బ్లూకాలర్ జాబ్‌లు ఉన్నాయని అనడంపై భగ్గుమన్నారు. ఐఐటీ, ట్రిపుల్ఐటీకి తేడా తెలియని సన్నాసి.. బ్లూకాలర్ జాబ్‌లు ఇస్తామడం సిగ్గుచేటని విమర్శించారు.
ఫిరాయింపులపై రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి
పార్టీ ఫిరాయింపులపై తాను లేవనెత్తిన అంశాలపై మంత్రి శ్రీధర్‌బాబు చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు. పార్టీ ఫిరాయింపుల అంశం సభలో మాట్లాడడానికి అవకాశం లేదని, స్పీకర్ ఒక అప్పీలేట్ అథారిటీగా తీర్పునిచ్చారని తెలుపడాన్ని తప్పుబట్టారు. సభలో చర్చలు రాజ్యాంగ పరిమితిలోనే జరుగుతాయని కేటీఆర్ గుర్తుచేశారు. ‘శాసనసభ రాజ్యాంగ పరిధిలో పనిచేసే సంస్థ. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులపై కూడా ఈ సభలో చర్చలు జరిగిన సందర్భాలున్నాయి. ఇటీవల బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ సభలో చర్చించాం అని ఉదహరించారు. అనర్హత పిటిషన్ల విషయంలో స్పీకర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని స్పీకర్‌ను మరోసారి కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు క్లీన్చిట్ ఇవ్వడం సరైంది కాదని, వారిపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.