MLA Harishrao | పటాన్ చెరు, జూన్ 27 : ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించేందుకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని మాజీ మంత్రి హరీష్రావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ క్యాంప్ కార్యాలయంలో పటాన్చెరువు ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు కలిసి సమస్యలు వివరించారు.
రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికుల జీవితం దయనీయంగా మారింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి మమ్మల్ని మోసం చేశారు..అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను బీఆర్ఎస్ ముందుండి పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల వ్యవధిలో 142 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవి ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలేనన్నారు హరీష్రావు. ఎన్నికల ముందు ఏడాదికి రూ.12,000 భృతి ఇస్తామన్న హామీ ఇచ్చి మోసం చేశారు. కానీ ఇప్పుడు ఆటో కార్మికుల గురించి ఒక్క మాటా మాట్లాడడం లేదు. ఆటోలు నడవక, బ్యాంకుల కిస్తీలు చెల్లించలేక ఆర్థికంగా కుదేలవుతున్నారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు.
ఆటో కార్మికుల కుటుంబాల పోషణ భారంగా మారి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మాట తప్పడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారింది. అసెంబ్లీ వేదికగా కూడా ఆటో కార్మికుల పక్షాన ప్రశ్నించింది బీఆర్ఎస్. కార్మికుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుంది. ఆటో కార్మికులకు కేసీఆర్ అండగా ఉంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేసి, ఆటో కార్మికులకు భద్రత కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు కనీసం రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయాలి. రెండేళ్లుగా ఒక్కో కార్మికుడికి బాకీ పడ్డ రూ.24 వేలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.