సంగారెడ్డి, మే 01 : ప్రధాని మోదీ సామ్రాజ్యవాదానికి అనుకూలంగా పనిచేస్తూ పెట్టుబడిదారులకు ముద్దుబిడ్డగా మారారని, లేబర్ కోడ్లతో కట్టుబానిసలుగా కార్మికులను చేశారని సిఐటియూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు మండిపడ్డారు. శుక్రవారం మే డే (కార్మిక దినోత్సవం) సందర్భంగా సంగారెడ్డిలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ శ్రామికవర్గం తమ హక్కుల సాధనకు దీక్ష దినంగా మేడేను నిర్వహిస్తుందన్నారు. 1886లో ఆమెరికాలోని చిగాలో నగరంలో జరిగిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని 8గంటల పనిదినాన్ని తమ హక్కుగా సాధించుకున్న చరిత్ర మేడేకు ఉందన్నారు.
కానీ ఇపుడు పాలకులు తిరిగి మళ్లీ పనిగంటలు పెంచేటటువంటి చట్టాలను మార్పు చేస్తున్నారని, ముఖ్యంగా మన దేశంలో 29 కార్మిక చట్టాలను ప్రధాని మోదీ ప్రభుత్వం రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్స్‌ను తీసుకువచ్చారన్నారు. దాని పర్యావసానంగా ఈవాళ 12గంటల పని చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ సమావేశంలో సిఐటియూ జిల్లా కార్యదర్శి సాయిలు, జిల్లా ఉపాధ్యాక్షులు బాగారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి, ప్రసన్నకుమార్, ప్రవీణ్, సురేష్, శ్రీధర్, రామ్‌రెడ్డి, భీమ్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, పరమేశ్వర్, సువర్ణ, సదానందం, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.