చేగుంట, డిసెంబర్ 15: కోట్లాది మంది కార్మికులకు బీడీ పరిశ్రమలు ఉపాధినిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి ఇదే జీవనాధారం. బీడీలు చుడుతూ వచ్చిన కూలి డబ్బులతో తమ కుటుంబాలనున పోషించుకోవడంతో పాటు పిల్లలను చదివిస్తూ, కొద్దిపాటి సొమ్మును ఆదా చేసుకుని వారి పెండ్లిళ్లు చేస్తున్నారు. బీడీ పరిశ్రమల ద్వారా తునికి ఆకు తెంపే కూలీలు, తంబాకు పండించే రైతులు, బీడీలు చుట్టే కార్మికులు, ఆకు సేకరించే కార్మికులు, కమీషన్ ఏజెంట్లు, కంపెనీల్లో పనిచేసే కార్మికులు, బట్టీ కార్మికులు ఇలా ఎంతో మంది జీవనం గడుపుతున్నారు. దేశంలోని 14రాష్ర్టాల్లో సుమారు 3కోట్ల మంది బీడీ కార్మికులు ఉండగా రాష్ట్రంలో 80లక్షల మంది, ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా సుమారు 7లక్షల మంది పనిచేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 65వేల మంది కార్మికులు ఇదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారు
ఒక్క రోజులో దాదాపు 6వందల నుంచి 8వందల వరకు బీడీలు చుడతారు. తెలంగాణలో వ్యవసాయం తరువాత పెద్దఎత్తున ఉపాధి కల్పిస్తున్నది బీడీ పరిశ్రమను ధ్వంసం చేసి, లక్షలాది మంది పొట్ట కొట్టే విధంగా కేంద్రం యోచిస్తున్నదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో వెయ్యి బీడీలకు రూ.16.24 ట్యాక్స్ రూపంలో వసూలు చేసి, వాటిని కార్మికులకు వైద్య సమస్యలు ఎదురైనప్పుడు రీయింబర్స్మెంట్ కింద ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం జీఏస్టీ పేరుతో వెయ్యి బీడీలకు రూ.168 రూపాయలు వసూలు చేస్తున్నది. దీంతో వారికొచ్చే కొద్దిపాటి ఆదాయం తగ్గి ఇల్లు గడవలేని పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వం విదేశీ సిగరెట్ కంపెనీలను ప్రోత్సహిస్తూ, బీడీలపై ఎన్నో ఆంక్షలు పెట్టడం వల్ల మార్కెట్లో వాటిని కొనేవాళ్ల సంఖ్య తగ్గి నెలలో 15నుంచి 18రోజుల పని మాత్రమే దొరుకుతుందని కార్మికులు వాపోతున్నారు. గతంలో రోజుకు వెయ్యి చుట్టేందుకు కంపెనీలు పని కల్పించేవని, బీడీ కట్టలపై పుర్రె గుర్తు, లైసెన్స్ ఉన్న వ్యక్తులు మాత్రమే బీడీలు అమ్మాలని, జీఎస్టీ వంటి పన్నుల చట్టాలు తీసుకురావడంతో మార్కెట్లో బీడీలు విక్రయించేందుకు పరిశ్రమల యాజమాన్యాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయి.
గత 60సంవత్సరాల నుంచి బీడీలు చుడుతున్న. మాకిదే జీవనాధారం. ముగ్గురు పిల్లల పెండ్లిళ్లు చేసిన. నాకు వ్యవసాయ భూమిలేదు. చాటను నమ్ముకొని బతుకుతున్న, వేరే పనిరాదు. రాజీనామా పెట్టుకున్నప్పుడు రూ.350 పింఛన్ వచ్చేది. ఇప్పుడు నెలకు 5వందల పింఛన్ వస్తుంది. వచ్చిన డబ్డులు సరిపోక మళ్లీ రోజూ 5 నుంచి 6 వందల బీడీలు చేస్తున్న. బీడీలు చేయొద్దు అని కేంద్రం చెబుతుంది. బీడీలు లేకుంటే ఏట్లా బతకేది. ఖర్చులు పెరిగాయి. కార్మికులు రాజీనామా చేస్తే పింఛన్‌ను రూ.7వేలు ఇవ్వాలి. కోర్టు చెప్పినా కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు. – తుమ్మ బాలవ్వ, బీడీ కార్మికురాలు, కర్నాల్‌పల్లి, చేగుంట మండలం, మెదక్ జిల్లా.
బీడీలు చుడితేనే మాకు పూట గడుస్తుంది, బీడీలు చేసి ఇంట్లోని ఆడబిడ్డల పెండ్లిళ్లు, మా పిల్లల పెండ్లిళ్లు చేసినం. కార్మికుల కష్టాలను గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్ జీవనభృతి కల్పించారు. నాకు రాజీనామా పింఛన్ 7వేల వరకు రావాలి. ప్రస్తుతం వెయ్యి వస్తుంది. వచ్చినవి సరిపోవడం లేదు. మాకు కట్ అయిన పైసలు కేంద్రం దగ్గర చాలా నిలువ ఉన్నాయి. ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. మా ఇంట్లో ఒకరికి జీవనభృతి రావడం వల్ల కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉంది.
– తుమ్మ కౌసల్య, బీడీ కార్మికురాలు, కర్నాల్‌పల్లి, చేగుంట మండలం,మెదక్ జిల్లా
బీడీ కార్మికులకు ప్రయోజనం కలిగించే చట్టాలు తేకుండా, పరిశ్రమలను మూసివేసే విధంగా కేంద్రం ప్రభుత్వం కొత్త కొత్త జీవోలను తెస్తే కార్మికుల పక్షాన పోరాడి బీడీ పరిశ్రమ రంగాన్ని రక్షించుకుంటాం. భవిష్యనిధిలో బీడీ కార్మికులకు ఎలాంటి సంబంధం లేకుండా అదనంగా రూ. 6వేల కోట్లు నిల్వ ఉన్నాయి. ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు నెలకు రూ.7వేలు పింఛన్ ఇవ్వాలని కార్మిక సంఘాల స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ప్రతి బీడీ కార్మికురాలికి ప్రత్యేక వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. తెలంగాణలోని బీడీ కార్మికులకు జీవన భృతి కల్పించిన ముఖ్యమంత్రికి కార్మికుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. ఇతర రాష్ర్టాల్లో కూడా అక్కడి ప్రభుత్వాలు పీఎఫ్ కలిగిన ప్రతి ఒక్కరికీ జీవనభృతి కల్పించి ఆదుకోవాలి.
– అనుముల గంగాధర్, తెలంగాణ బీడీ లేబర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కార్పొరేట్ సంస్థలు తయారు చేస్తున్న సిగిరెట్పై లేని ఆంక్షలు, బీడీ కార్మికుల పొట్ట కొట్టే విధంగా కేంద్రప్రభుత్వం ఎందుకు చట్టాలు చేస్తున్నదని కార్మికులు, సంఘాల నాయకులు మండి పడుతున్నారు. కేంద్రం కార్మికులకు భరోసా కల్పించాల్సింది పోయి.. కొత్త చట్టాలు, జీవోలు అమలు చేస్తుండడంతో తామంతా రోడ్డున పడే అవకాశం ఉందని వాపోతున్నారు. సిగరెట్, అంబర్, గుట్కా, కల్లు, వైన్లు తీసుకుంటే రాని జబ్బులు బీడీలు సేవిస్తే ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. తమ పీఎఫ్ డబ్బులు కేంద్ర కార్మిక సంక్షేమ నిధిలో పెద్దమొత్తంలో జమ అవుతున్నాయని, కానీ ఉద్యోగ విరమణ పొందిన వారికి కేవలం రూ.500 నుంచి రూ. వెయ్యి మాత్రమే పింఛన్ చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 50 నుంచి 58 సంవత్సరాల తరువాత రాజీనామా చేసిన కార్మికులకు నెలకు రూ.7వేలు పింఛన్ వచ్చే విధంగా కృషి చేయాలని, బీడీ కార్మికులతో పాటు వారి కుటుంబసభ్యులకు ఉచితంగా వైద్యం అందించాలని, ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చి, తమ ఆరోగ్యానికి భరోసా కల్పించాలని కార్మికులు కోరుతున్నారు.
చేతినిండా పనిలేకుండా దిక్కుతోచని స్థితిలో ఉన్న కార్మికులు వీధిన పడే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీడీ కార్మికుల కష్టాలను గుర్తించి జీవన భృతి కల్పించడంతో కార్మికులకు కొంత ఊరట కలిగింది. 2014వరకు పీఎఫ్ కలిగిన మాత్రమే జీవనభృతి వచ్చేది. అయితే, ప్రత్యేక రాష్ట్రం వచ్చాక 2014 కటాఫ్ డేట్‌ను తొలిగించి పీఎఫ్ కలిగిన ప్రతి కార్మికుడికి తెలంగాణ ప్రభుత్వం జీవనభృతి అందిస్తున్నది.