జహీరాబాద్, మార్చి 18: ఉస్మానియా వర్సిటీలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, నినాదాలను నిషేధిస్తూ అధికారులు జారీ చేసిన సర్క్యులర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని పట్టణ బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం జహీరాబాద్ నుంచి (Zaheerabad) అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న బీఆర్ఎస్వీ నాయకులు రాకేష్, ఓంకార్‌ను పట్టణ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో ఆంధ్రా పాలకులు ఇలాంటి ఆంక్షలు పెట్టి ఉంటే.. వర్సిటీలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగి ఉండేది కాదన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో నిర్బంధాలను అడ్డుకుంటామన్నారు.
యూనివర్సిటీ అధికారులు విద్యార్థి సంఘాలతో చర్చించకుండా.. ప్రభుత్వ ఒత్తిడితో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం దారుణమన్నారు. ఐదు నెలల వీసీ పాలనలో.. సమస్యలు చెప్పుకొనేందుకు వెళ్లిన దివ్యాంగ విద్యార్థులను అమానుషంగా అరెస్టు చేయించి, వారిపై కేసులు పెట్టారంటూ మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రశ్నించే గొంతు నొక్కేందుకు యూనివర్సిటీలో ధర్నాలు నిరసనలు చేపట్టకుండా ఉత్తర్వులను జారీ చేయించడం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే ఉత్తర్వులను ఉపసంహరించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు