మునిపల్లి, డిసెంబర్ 20: సంగారెడ్డి జిల్లా మునిపల్లి (Munipalli) మండలంలో పంచాయతీ ఎన్నికలకు (Panchyathi Elections) ఉపయోగించిన ఓ బ్యాలెట్స్ బాక్స్ (Ballot Box) కనిపించకుండా పోయింది. ఎన్నికలు ముగిసి ఆరు రోజులైనా అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 14న మునిపల్లి మండలంలో పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఉపయోగించిన బ్యాలెట్ బాక్సులలో ఒకటి మాయమైంది.
మునిపల్లి మండలంలోని 30 గ్రామ పంచాయతీలకు డిసెంబర్ 14న ఎన్నికలు నిర్వహించేందుకు 262 మంది పీఓలు, 301 మంది ఓపిఓలను జిల్లా అధికారులు నియమించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత సిబ్బంది తమ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను మండల కేంద్రమైన మునిపల్లి ఆదర్శ పాఠశాలలో అధికారులకు అప్పగించాలి. అయితే ఎన్నికల అధికారుల నిర్లక్ష్యమో, మండల ఎన్నికల అధికారులు నిర్లక్ష్యమో తెలియదుగానీ పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ బాక్స్ ఎక్కడ ఉందో తెలవడం లేదు. కాగా, మునిపల్లి మండల ఎన్నికల అధికారి.. మండలంలోని పంచాయతీ కార్యదర్శులకు గ్రామల్లో బ్యాలెట్ బాక్స్ ఎక్కడ ఉందో వెతికి తీసుకువస్తేనే బాగుంటుందని, లేకపోతే మీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం.
‘మండలంలో ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే వేరే చోటుకు వెళ్లిపోండి. నేను చెప్పినట్లు వినకపోతే మీ అంతు చూస్తా’ అంటూ మునిపల్లి మండల అభివృద్ధి అధికారి తమను బెదిరింపులకు గురిచేస్తున్నట్లు మండల పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాలెట్ బాక్స్ గల్లంతైన విషయంలో, ఎన్నికల రోజు పంచాయతీల నుంచి తొందరగా ఎవ్వరికి చెప్పకుండా ఇండ్లకు వెళ్లినందుకు మండలంలోని గ్రామ కార్యదర్శులందరికీ షోకాజు నోటీసులు అందజేసినట్లు సమాచారం. బ్యాలెట్ బాక్స్ మాయమైన విషయంపై మునిపల్లి ఎంపీడీఓను సంప్రదించినా ఆయన స్పందించడం లేదు.