పటాన్చెరు, జనవరి 1 : కొత్త సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్టు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శనివారం పటాన్చెరు మండలం రుద్రారంలోని గణేశ్ దేవస్థానంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఆయన సతీమణి యాదమ్మ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఏడాది కరోనా మహమ్మారి పీడ పూర్తిగా వీడాలని మొక్కినట్టు తెలిపారు. వర్షాలు సకాలంలో కురిసి పాడి పంటలు పండాలని, నియోజకవర్గం అభివృద్ధిలో పయనించాలని స్వామివారికి మొక్కుకున్నట్టు తెలిపారు. ఆయన వెంట పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్, ఎంపీటీసీ మన్నె రాజు, నాయకులు వెంకట్‌రెడ్డి, విజయ్‌కుమార్, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన కలెక్టర్..
రుద్రారం సిద్ధి వినాయకుడిని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు దంపతులు సందర్శించుకున్నారు. వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి కలెక్టర్‌ను ఆశీర్వదించారు. అనంతరం గణేశ్ దేవస్థానం ఆవరణలో కలెక్టర్ మొక్క లు నాటారు.
కిటకిటలాడిన బీరంగూడ దేవస్థానం..
బీరంగూడలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానాకి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా మల్లికార్జున స్వామివారిని సందర్శించుకుని పూజలు చేశారు. దేవస్థానంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఎమ్మెల్యేను కలిసిన కౌన్సిలర్లు..
నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, బొల్లా రం మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి శనివారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే కేక్ కట్ చేసి తినిపించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ చంద్రయ్య, నాయకులు వెంకటయ్య, రాజ్‌గోపాల్, చక్రపాణి, నర్సింహ, రాజేశ్ పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు..
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు టీఆర్ఎస్ నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శనివారం సదాశివపేటలోని మాజీ ఎమ్మెల్యే నివాసంలో కౌన్సిలర్ షేక్ సాబెర్ ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల నర్సింహులు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను కలిసిన వారిలో టీఆర్ఎస్ మండల అద్యక్షుడు కొత్తపల్లి చక్రపాణి, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, డైరెక్టర్ మసూద్, కుమార్ నాయక్, కో-ఆప్షన్ సభ్యుడు ఆసీఫ్, ఆజీమ్, యూసుఫ్, ప్రవీణ్‌కుమార్, మైనార్టీ నాయకులు ఉన్నారు.
చైర్పర్సన్ దంపతులకు కౌన్సిలర్ల శుభాకాంక్షలు..
కొత్త ఏడాదిలో పట్టణవాసులు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, రవి దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శనివారం చైర్పర్సన్ నివాసంలో చైర్పర్సన్ దంపతులు, వైస్ చైర్మన్ లతావిజయేందర్రెడ్డిని కౌన్సిలర్ శ్రీకాంత్(నాని), మాజీ కౌన్సిలర్, ప్రస్తుత కౌన్సిలర్ విజయలక్ష్మి భర్త చంద్రశేఖర్ కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.