జహీరాబాద్, అక్టోబర్ 19: సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడిగి గ్రామ శివారులోని అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్ పోస్టుపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి నుంచి డీఎస్పీ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా రూ.43,300 నగదు పట్టు బడింది. ప్రభుత్వం చెక్ పోస్టులు ఎత్తివేసినప్పటికి అనధికారంగా అంతరాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని మాడిగి గ్రామ శివారులో చెక్ పోస్టును నిర్వహిస్తూ రవాణా శాఖ అధికారులు వాహనదారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
ముంబై-హైదరాబాద్ 65వ జాతీయ రహదారిపై ప్రతిరోజు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో అధికారులు ప్రైవేట్ వ్యక్తులను నియమించి అక్రమాలకు పాల్పడుతున్నారు. దీంతో నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. అధికారుల వద్ద లభించిన నగదుకు సంబంధించి ఎలాంటి వివరాలు లేకపోవడంతో డబ్బుతోపాటు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఆర్టీఏ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎంవీఐ కిరణ్ కుమార్ను అదుపులోకి తీసుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.