జహీరాబాద్, నవంబర్ 15: జహీరాబాద్ నియోజకవర్గంలో (Zaheerabad) ఏసీబీ అధికారుల దాడులు (ACB Raids) కలకలం రేపుతున్నాయి. చిరుద్యోగులే కాదు పెద్దస్థాయిలో ఉన్న అధికారులను సైతం వదలనంటోంది ఏసీబీ. ఉన్నతాధికారి అయినా.. సామాన్య ఉద్యోగి అయినా అవినీతికి పాల్పడితే అంతే సంగతులంటూ చేతల్లో చూపిస్తోంది. అవినీతి అధికారుల విషయంలో ఏసీబీ దూకుడుతో సరికొత్త గుబులు స్టార్ట్ అయింది. గత ఐదు నెలల్లోనే ఐదుగురు అధికారులు ఏసీబీకి పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. వరుస ఘటనలతో జిల్లా అధికారుల్లో కలవరం మొదలైంది. ఇటీవల కాలంలో ఏసీబీ అధికారులు అవినీతికి పాల్పడుతున్న వారిని పట్టుకునే విషయంలో దూకుడు పెంచినట్టుగా స్పష్టం అవుతోంది. రెడ్ హ్యాండెడ్గా దొరికితే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు మధ్యవర్తుల ద్వారా లంచం తీసుకుంటున్న ఘటనలు కూడా వదిలిపెట్టడం లేదు. మధ్యవర్తిత్వం చేసిన వారికి బాధితులకు ఎలాంటి సంబంధాలు లేకపోవడంతో పాటు అవినీతికి పాల్పడే అధికార యంత్రాంగం ఎంచుకున్న సరికొత్త మార్గాన్ని కూడా ట్రేస్ చేస్తున్నారు. దీంతో మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న వారు కూడా ఏసీబీ కేసుల్లో ఇరుక్కొక తప్పడం లేదు.
అధికారులకు వంత పాడేందుకు ప్రయత్నిస్తే ప్రైవేటు వ్యక్తులు అయినా సరే చట్టాలకు పనిచెప్పి తీరుతామని అంటున్నారు ఏసీబీ అధికారులు. గత జూలైలో నిమ్జ్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న బాధిత రైతుడి కి పరిహారం చెక్కు చెల్లింపు విషయంలో ముడుపులు తీసుకుంటూ డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ తాసిల్దార్, ఆర్డీవో కారు డ్రైవర్ను ఏసీబీ పట్టుకున్నారు. అక్టోబర్లో మొగుడంపల్లి మండల పరిధిలోని మాడిగి గ్రామ శివారులోని ఆర్టీఏ చెక్పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. పార్టీ అధికారులు ప్రైవేట్ వ్యక్తులను నియమించుకొని వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దాడులు చేసి పట్టుకున్నారు.
తాజాగా ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు శుక్రవారం జహీరాబాద్ పట్టణ సమీపంలోని రంజోల్ గ్రామ శివారులోని సబ్ రిజిస్టర్ కార్యాలయంపై అధికారులు దాడులు చేశారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొనుగోలుదారుడు అమ్మకం దారుడు మాత్రమే ఉండాల్సి ఉన్నప్పటికీ, ఇతర వ్యక్తులు ఉండకూడదని నిబంధన ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని గ్రహించి ప్రైవేట్ వ్యక్తుల నుంచి రూ.42,300 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే స్థానిక సబ్ రిజిస్ట్రార్ పరంజ్యోతి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేసి నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. 2024లో నిమ్జ్ పరిహారం చెక్కుకు సంబంధించి న్యాల్కల్ ఆర్ఐ బాధితులు నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే.
అవినీతి అధికారులను టార్గెట్ చేస్తూ ఏసీబీ నిఘా పెంచడంతో అధికారుల్లో ఆందోళన కలుగుతోంది. ఏసీబీ అధికారుల వరుసదాడులు జరుగుతున్నట్లు ప్రచారం నెలకొనడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏసీబీ అధికారుల దాడులతో ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు. జహీరాబాద్ నియోజవర్గంలో నిమ్జ్ ప్రాజెక్టు కార్యాలయంతో పాటు సబ్ రిజిస్ట్రేషన్, రవాణా శాఖల్లో ఏసీబీ సోదాలు జరగడం, ఐదుగురు అధికారులు పట్టుబడడంతో అవినీతి అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఇటీవల ఏసీబీ అధికారులు ముమ్మరంగా దాడులు చేస్తుండడం అవినీతి అధికారుల్లో దడ పుట్టిస్తుందనే విషయంలో సందేహం లేదు. అవినీతి ఎక్కువ ఉందని భావిస్తున్న శాఖల్లో రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ శాఖ, పోలీస్, రిజిస్ట్రేషన్, ఆర్టీఏ, అటవీ, హెల్త్, వ్యవసాయ శాఖలు ముందున్నయని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఏసీబీ వరుస దాడులతో ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. ఈరోజు ఎక్కడ, ఏ ప్రాంతం, ఏ శాఖ నుంచి ఏసీబీ అధికారులకు ట్రాప్ అయినట్లు వినవలసి వస్తుందోనని ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.