
ఆరుగాలం కష్టపడి పంటలు పండించి ఈ లోకానికి తిండిపెడుతున్న అన్నదాతల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక విధాలుగా కృషిచేస్తున్నారు. రైతు కుటుంబాలకు ఆర్థిక ధీమా కల్పించడానికి ‘రైతుబీమా’ పథకాన్ని 2018 ఆగస్టులో ప్రారంభించారు. రైతు ఏవిధంగా చనిపోయినా ఈ బీమా కింద రూ.5 లక్షల బీమా పరిహారం పది రోజుల్లో నామినీకి అందుతున్నది. తద్వారా రైతు కుటుంబం రోడ్డున పాడకుండా కాపాడుతున్నది. వ్యవసాయ భూమి కలిగి పట్టాదారు పాసుపుస్తకం ఉన్న 18 నుంచి 59 ఏండ్లలోపు రైతులకు రైతుబీమా పథకం వర్తిస్తుంది. ఒక్కో రైతు పేరిట ఎల్ఐసీకి రూ.3486.90 చొప్పున ఏటా ప్రభుత్వం ప్రీమియాన్ని చెల్లిస్తున్నది. గతంలో రైతుబీమాకు దరఖాస్తు చేసుకోని రైతులతో పాటు కొత్తవారు ఈనెల 10వ తేదీలోగా స్థానిక వ్యవసాయశాఖ అధికారులకు దరఖాస్తు సమర్పించాలి. ఇప్పుడు దరఖాస్తు చేసుకోక పోతే మళ్లీ ఏడాది వరకు అవకాశం ఉండదు. ఈ ఏడాది సిద్దిపేటలో 1145 మంది రైతులు, మెదక్ జిల్లాలో 785 మంది రైతులకు పరిహారాన్ని అధికారులు అందించారు.సిద్దిపేట, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
రాష్ట్రంలోని రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటున్నది. వారి కోసం రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్ వంటి పథకాలు అమలు చేస్తున్నది. సీఎం కేసీఆర్ వేసే ప్రతి అడుగు రైతు సంక్షేమానికే ఉంటున్నది. వ్యవసాయం చేస్తున్న రైతు కుటుంబాలకు ఆర్థిక ధీమా కల్పించడానికి సీఎం కేసీఆర్ రైతుబీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం రైతులకు భరోసా కల్పిస్తున్నది. రైతు ఏ కారణంతో అయినా చనిపోతే ఆ కుటుంబానికి రైతుబీమా పథకం కింద రూ.5 లక్షలను నేరుగా నామినీ ఖాతాలో ఎల్వోసీ జమ అవుతున్నాయి.
సిద్దిపేట, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సిద్దిపేట జిల్లాలో 2020-21 సంవత్సరానికి గాను 1,61,065 మంది రైతుల కోసం ఒక్కొక్కరికీ రూ.3,486.90 చొప్పున రూ.56.16 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించింది. ఈ ఏడాది జిల్లాలో 1145 మంది రైతులు మరణించారు. ఎల్ఐసీ ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున రూ.57.25 కోట్ల బీమా పరిహారం అందింది. అంటే ప్రీమియం చెల్లించిన దానికంటే అదనంగా రూ.1.90 కోట్లు రైతుల కుటుంబాలకు వచ్చాయి.
మెదక్ జిల్లాలో 2020-21 సంవత్సరానికి గాను 1,33,556 మంది రైతుల కోసం రైతుబీమా ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లించింది. జిల్లాలో ఈ ఏడాదిలో 785 మంది రైతులు మరణించారు. వారి కుటుంబాలకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో 10 రోజుల్లోనే రూ.39.25 కోట్ల బీమా పరిహారం జమ అయ్యింది.
రూ.5 లక్షల బీమా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసీకి ఒక్కో రైతు పేరిట రూ.3,486.90 ప్రీమియాన్ని చెల్లిస్తున్నది. ఈ నెల 14 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 13 వరకు ఏడాది పాటు బీమా వర్తిస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అర్హులైన రైతులు తమ పేర్లను స్థానిక వ్యవసాయ శాఖ అధికారుల వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. గతంలో నమోదు చేసుకున్న రైతులవి ఆటోమేటిక్‌గా రెన్యువల్ చేస్తారు. చనిపోయిన వారివి, వయస్సు దాటిన రైతుల పేర్లను తొలిగించి ఫైనల్ జాబితా సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు.
2018 ఆగస్టులో రైతుబీమా పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి ఆగస్టులో రైతులందరి ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వం బీమా సంస్థ ఎల్ఐసీకి చెల్లిస్తున్నది. ఇలా వరుసగా నాలుగో ఏడాది రైతుబీమాను ప్రభుత్వం అమలు చేస్తున్నది. కొత్తగా భూమి రిజిస్టర్ చేసుకున్న రైతులతో పాటు ఇంతకు ముందు రైతుబీమా చేసుకోని రైతులు ఈ ఏడాది చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఆయా గ్రామాల్లో వ్యవసాయ విస్తరణాధికారులు, రైతుబంధు సమితి సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో వివరాలను సేకరిస్తున్నారు. అర్హులైన వారి జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ప్రదర్శిస్తారు. రైతు పేరిట భూమి ఉండి, పట్టాదారు పుస్తకం ఉన్న రైతులు 18 నుంచి 59 ఏండ్లలోపు వారికి రైతుబీమా పథకం వర్తిస్తుంది. వారం రోజుల్లో వివరాలు సేకరించి అర్హుల జాబితాను సిద్ధం చేసే పనిలో వ్యవసాయశాఖ అధికారులు నిమగ్నమయ్యారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో సన్న, చిన్నకారు రైతులే అధికంగా ఉన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో ప్రతి రైతుకు బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించి రైతు కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నది. రైతు ఏ కారణంగా మరణించినా పరిహారం చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవిత బీమా సంస్థ ఎల్ఐసీతో ఒప్పందం చేసుకున్నది. రైతు మరణించిన 10 రోజుల్లోనే నేరుగా బాధిత కుటుంబానికి బీమా పరిహారం డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటున్నది. రైతు నామినీ ఖాతాలో నేరుగా ఎల్ఐసీ పరిహారం డబ్బులు జమ చేస్తున్నది. రైతులు తమ పంట పొలాలకు వెళ్లినప్పుడు అనుకోని సంఘటనలు జరిగి మృతి చెందుతున్నారు. రైతు ఏవిధంగా మరణించినా ఆ కుటుంబానికి ప్రభుత్వం పరిహారం అందిస్తున్నది. ఇప్పటి వరకు ఎన్నో కుటుంబాలకు బీమా సొమ్ము అందింది.
కొత్తగా భూమి రిజిస్టర్ చేసుకున్న రైతులతో పాటు ఇంతకు ముందు రైతు బీమా చేసుకోని రైతులు ఈ ఏడాది చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆయా గ్రామాల్లో వ్యవసాయ విస్తరణాధికారులు అందుబాటులో ఉండి స్థానిక ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి సభ్యుల సహకారంతో వివరాలను సేకరిస్తున్నారు. ప ట్టాదారు పాస్ పుస్తకం ఉన్న రైతులు 18-59 ఏండ్లలోపు వారికి ఈ పథకం వర్తిస్తుంది. వయస్సు ధ్రువీకరణకు రైతు ఆధార్‌కార్డును పరిగణనలోకి తీసుకుంటాం. ఆధార్ కార్డులో ఏ తేదీ ఉంటే అదే తేదీ ప్రా మాణికంగా తీసుకుంటాం. కొంతమందికి అక్కడక్కడ రెండు కార్డులున్నాయి. ఏది కరెక్టో ఇప్పుడే ధ్రువీకరించుకుని అదే కార్డు ఇవ్వాలి. తర్వాత ఆధార్ కార్డు మ్యాచ్ అవుత లేదు అంటే, అప్పుడు ఏం చేయలేం. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.