సంగారెడ్డి మున్సిపాలిటీ, అక్టోబర్ 18: ప్రతిఒక్కరూ కొవిడ్ టీకా తీసుకొని రక్షణ పొందాలని ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించింది. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 9,15,645 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇందులో హెల్త్ కేర్ వర్కర్లు 7,572 మంది మొదటి డోస్ తీసుకోగా, 5,838 మంది రెండో డోస్ తీసుకున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్లు 10,895 మంది మొదటి డోస్ తీసుకోగా, 5,617 మంది రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. 60 ఏండ్లు పైబడిన వారు 47,298 మంది మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకోగా, 26,889 మంది రెండో డోస్ తీసుకున్నారు. 45 నుంచి 59 ఏండ్ల వయస్సు వారు 2,53,352 మంది మొదటి డోస్ తీసుకోగా, 96,976 మంది రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అదేవిధంగా 18 నుంచి 44 ఏండ్ల వయస్సు వారు 3,59,138 మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకోగా, 1,02,070 మంది రెండో డోస్ తీసుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు అర్బన్ ఏరియాల్లో 91.60 శాతం, రూరల్ ఏరియాల్లో 56 శాతం మంది కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. కాగా, జిల్లాలో 7,97,043 మంది కోవిషీల్ట్ వ్యాక్సిన్ తీసుకోగా, 1,18,602 మంది కోవాగ్జిన్ తీసుకున్నారు. వ్యాక్సినేషన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవడం ఇదే మొదటి సారి. గ్రామాలు, పట్టణాల్లో ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పిస్తున్నారు.
పది లక్షలకు చేరువలో వ్సాక్సినేషన్
జిల్లాలో 10 లక్షలకు చేరువలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. జిల్లాలో ఇప్పటివరకు 9,15,645 మందికి కొవిడ్ వ్యాక్సిన్ అందించాం. ఇందులో మొదటి డోస్ 6,78,255, రెండో డోస్ 2,37,390 మందికి వేశాం. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లోని పీహెచ్సీ సెంటర్లలోప్రజలకు వ్యాక్సిన్ అందించే ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకు అర్బన్ ఏరియాల్లో 91.60 శాతం, రూరల్ ఏరియాల్లో 56 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది. జిల్లాలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకొని కరోనా నుంచి రక్షణ పొందాలి.