జహీరాబాద్, ఫిబ్రవరి 17 : కాళేశ్వరం జలాలతో బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ గోదావరి నీళ్లు సింగూరు ప్రాజెక్టులో నింపి ఎత్తిపోతల ద్వారాల వ్యవసాయానికి సాగునీరు అందించనున్నారని బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, జహీరాబాద్ నియోజకవర్గ సీఎం సభ జనసమీకరణ సమన్వయ కర్త దేవీప్రసాద్ అన్నారు. గురువారం జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరి జలాలు జహీరాబాద్‌కు రావడం ఆషామాషీ కాదన్నారు. ప్రభుత్వం గోదావరి నీళ్లు సింగూరు ప్రాజెక్టులో నింపనున్నట్లు చెప్పారు. ప్రతి ఎకరానికి సాగు నీరు అందించేందుకు ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. సీఎం కేసీఆర్, ప్రభుత్వాన్ని రైతులు ఆశీర్వదించాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నట్లు తెలిపారు.
21న ‘ఖేడ్’లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులకు భూమి పూజ చేసేందుకు ఈ నెల 21న నారాయణఖేడ్‌లో నిర్వహించే బహిరంగ సభకు సీఎం కేసీఆర్ రానున్నట్లు తెలిపారు. జహీరాబాద్ నియోజకవర్గం నుంచి 50 వేల మందిని జనసమీకరణ చేయాలనే లక్ష్యంతో ముందుకుపోతున్నామన్నారు. భారీ జనసమీకరణకు ఎమ్మెల్యే మాణిక్‌రావుతో కలిసి ప్రతి మండలానికి సమన్వయ కర్తలను నియమించారన్నారు. మహిళా సంఘాలు, రైతులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సీఎం సభ ముగిసే వరకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేస్తామన్నారు. గ్రామాల్లో ప్రజలను సభకు స్వచ్ఛందంగా తరలిరానున్నట్లు చెప్పారు. ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. పార్టీ అధిష్ఠానం ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు కృషిచేస్తానన్నారు.