అందోల్/జహీరాబాద్/న్యాల్కల్/జిన్నారం, జనవరి 1 : గ్రామాల్లో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. 2021 సంవత్సరానికి వీడ్కోలు పలికి.. నూతన -2022 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ శుక్రవారం రాత్రి యువతీ యువకులు వేడుకలు జరుపుకొన్నారు. మండలంలోని హద్నూర్, న్యాల్కల్, మిర్జాపూర్(బి), గంగ్వార్, రేజింతల్, ముంగి, అత్నూర్, డప్పూర్, చాల్కి, కాకిజనవాడ, చీకూర్తి, న్యామతాబాద్, గుంజోట్టి, రాంతీర్థం తదితర గ్రామాల్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. యువకులు నృత్యాలు, కేరింతల మధ్య విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఒకరినొక్కరూ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. సెల్ఫీలు దిగుతూ స్నేహితులకు వాట్సాప్‌లో శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ద్వారా బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల్లోని చర్చిల్లో క్రైస్తవులు కేక్ కట్ చేసి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శనివారం ఉదయం గ్రామాల్లో యువతులు, మహిళలు ఇంటి ఎదుట నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ రంగురంగుల ముగ్గులు వేశారు. మండలంలోని రేజింతల్ సిద్ధివినాయక, ముంగి ఆదిలక్ష్మి, రాఘవపూర్‌లోని పంచవటి క్షేత్రం, మల్గిలోని నవనాథ్ సిద్ధిలింగేశ్వర ఆలయాలు భక్తులతో కిక్కిరిపోయాయి. ఆయా ఆలయాల్లో భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజ లు చేశారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
నూతన సంవత్సరానికి ఘన స్వాగతం..
కొత్త ఏడాదిలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, ప్రతిఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యం తో సుఖంగా గడపాలని ఆకాంక్షిస్తూ హ్యాపీ న్యూఇయర్‌కు ప్రజలు స్వాగతం పలుకుతూ వేడుకలు చేసుకున్నారు. శనివారం పట్టణంలోని మేథడిస్ట్ చర్చి, పోతిరెడ్డిపల్లి శివారులోని రాక్ చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కొత్త ఏడాదికి స్వాగతం కొవ్వొత్తులు వెలిగించి ప్రభువును ప్రార్థించారు. ప్రత్యేక గీతాలపాలనతో చర్చిల ప్రాంగణాలు భక్తిపరవశ్యంతో నిండిపోయాయి.
న్యూఇయర్ వేడుకలు..
భారతీనగర్, ఆర్సీపురం డివిజన్లతోపాటు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. న్యూఇయర్ సందర్భంగా భారతీనగర్, ఆర్సీపురం డివిజన్ల కార్పొరేటర్లు సింధూఆదర్శ్‌రెడ్డి, పుష్పానగేశ్, తెల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ లలితాసోమిరెడ్డి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆర్సీపురం కార్పొరేటర్ పుష్పానగేశ్ను బల్దియా ఇంజినీరింగ్ అధికారులు డీఈ శిరీష, ఏఈలు ప్రభు, చంద్రశేఖర్ ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.