సంగారెడ్డి, మార్చి 25(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన వడగండ్ల వానకు 184 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను అందజేసింది. అంతకంటే ఎక్కువగానే పంటనష్టం జరిగిందని రైతులు చెబుతున్నారు. అకాల వర్షాలు, ఇతర విపత్తుల కారణంగా 33శాతానికి పైగా నష్టం జరిగితేనే వ్యవసాయశాఖ పంటనష్టంగా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. సంగారెడ్డి జిల్లాలో 500ఎకరాలకు పైగా పంటనష్టం జరిగిందని, అందరికీ పరిహారం అందించాలని రైతులు, రైతుసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సదాశివపేట మండలంలోని తంగేడుపల్లి, నాగుపల్లి, మునిపల్లి మండలంలోని బుధేరా, మేళాసంగం గ్రామా ల్లో 154 మంది రైతులకు చెందిన 184.20 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
అత్యధికంగా వంద మంది రైతులకు చెందిన 120 ఎకరాల్లో జొన్న పంటకు నష్టం వాటిల్లింది. తంగేడుపల్లిలో 40 ఎకరాలు, నాగులపల్లిలో 45 ఎకరాలు, మేళాసంగంలో 35 ఎకరాల్లో జొన్న పంట దెబ్బతింది. 9.2ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం జరిగింది. తంగేడుపల్లిలో 8 ఎకరాలు, బుధేరలో 1.20 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. తంగేడుపల్లిలో 4 ఎకరాల్లో గోధుమపంట దెబ్బతింది. 43 మంది రైతులకు చెందిన 42 ఎకరాల్లో కూరగాయల పంటలకు నష్టం జరిగిం ది. అత్యధికంగా 35 ఎకరాల్లో ఉల్లిగడ్డ, ఆరు ఎకరాల్లో టమాట, మరో ఎకరంలో బెండ దెబ్బతింది. జహీరాబాద్, అందోలు, సంగారెడ్డి నియోజకవర్గాల్లో వందలాది ఎకరాల్లో మామిడి పంటకు నష్టం జరిగితే, అధికారులు కేవలం 15 ఎకరాల్లో నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది.