సంగారెడ్డి, ఆగస్టు 29: సమాజంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాల అదుపునకు బ్యాంకర్ల సహకరం ఎంతో అవసరమని, గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంకు ఖాతాలు ఇవ్వొదని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ బ్యాంకర్లకు సూచించారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో వివిధ బ్యాంకు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను వినియోగించుకొని వివిధ రకాల నేరాలు పుట్టుకొస్తున్నాయన్నారు.
సైబర్ నేరాలపై సత్వర న్యాయానికి బ్యాంకర్లే కీలకం కానున్నారని, పోలీసులకు బ్యాంకర్లు సహకరిస్తే బాధితులకు తగిన న్యాయం చేసే అవకాశం ఉంటుందన్నారు. అడ్డదారిలో డబ్బు లు సంపాదించాలని, ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా యూపీఐ, బ్యాంక్ ఖాతాల ఆధారంగా సైబర్ నేరగాళ్లు తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారన్నారు. అ మాయక ప్రజలే టార్గెట్‌గా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. సైబర్ నేరాలకు సంబంధించి బ్యాంక్ సిబ్బంది దర్యాప్తు అధికారులకు సహకరించాలని, నేరానికి గురైన బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలన్నారు.
కోర్టు అనుమతితో సైబర్ బాధితులకు చేరవలసిన డబ్బును ఖాతా లో జమ చేసి బాధితులకు అండగా నిలవాలన్నారు. సైబర్ బాధితులు కోల్పోయిన డబ్బు రీఫండ్ అయినప్పుడే వారిలో పోలీసులపై నమ్మకం పెరుగుతుందన్నారు. ప్రతి బ్యాంక్‌లోనూ హై రిసల్యూషన్ కలిగిన సీసీ కెమెరాలను బ్యాంక్ లోపల, బయట, ఏటీఎంలలో అమర్చాలన్నారు. అనవసరమైన లింక్‌లను, ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయొద్దని, ఆన్లైన్లో అపరిచితులకు దూరంగా ఉండాలన్నారు. సైబర్ మోసానికి గురైతే 1930కి కాల్ గానీ లేదా www. cybe rcrime.gov.in లో రిపోర్ట్ చేయాలని సూచించారు. డీఎస్పీలు సత్తయ్యగౌడ్, రవీందర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, సైబర్ క్రైమ్ డీఎస్పీ వేణుగోపాల్‌రెడ్డి, నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రమేశ్, ఎస్బీ ఇన్స్పెక్టర్ విజయ్‌కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.