పటాన్చెరు/పటాన్చెరు టౌన్, ఏప్రిల్ 18: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో త్వరలోనే సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటు చేస్తామని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం పటాన్‌చెరులోని ఏరియా దవాఖానలో 14 విభాగాలు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాలు, ఆరోగ్య పథకాలపై ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి పరిశీలించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి స్టాల్స్‌లో ఉన్న ఆరోగ్య పథకాలను పరిశీలించారు. డీఎంహెచ్‌వో గాయత్రీదేవితో మాట్లాడి ఆరోగ్య పథకాల గురించి తెలుసుకున్నారు. ప్రజావైద్యంపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టీబీ వ్యాధిగ్రస్తులకు ప్రతినెలా రూ.500 పౌష్టికాహారం కోసం ప్రభుత్వం అందజేస్తున్నదని తెలిపారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్య మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలో మెరుగైన వైద్యసేవలు అందుతున్న రాష్ర్టాల్లో తెలంగాణకు 3వ ర్యాంకును నీతిఅయోగ్ ఇచ్చిందని మంత్రి గుర్తుచేశారు.
దేశంలో సర్కారు దవాఖానల్లో అత్యధిక కాన్పులు తెలంగాణలోనే జరుగుతున్నాయన్నారు. గతంలో ప్రభుత్వ దవాఖానల్లో 30శాతం కాన్పులు మాత్రమే జరిగేవని, ఇప్పుడు 54శాతం కాన్పులు జరుగుతున్నాయన్నారు. కేసీఆర్ కిట్, నాణ్యమైన వైద్య సేవలందిస్తుండడంతో 24శాతం వృద్ధి సాధ్యమైందన్నారు. ప్రతి పీహెచ్సీలో డాక్టర్ ఉండాలని మంత్రి ఆదేశించారు. డాక్టర్ల కొరత ఉంటే ఆ స్థానంలో కొత్త డాక్టర్లను నియమించే అధికారం కలెక్టర్లకు ఇచ్చామని తెలిపారు. డీఎంహెచ్వోలు ఖాళీల వివరాలను కలెక్టర్లకు ఇవ్వాలని కోరారు. పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో నూతనంగా 250 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటు కోసం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ను కలిసి పలుమార్లు విజ్ఞప్తి చేశామన్నారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని, అప్పుడు నాణ్యమైన వైద్య సేవలు ప్రజలకు అందుతాయని మంత్రి తెలిపారు.
దవాఖాన తేవడం నా కల .. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. పటాన్చెరు పట్టణానికి సూపర్ స్పెషాలిటీ దవాఖాన తేవడం తన కల అన్నారు. కార్మికులు, పేదలకు ఈ దవాఖాన ఉపయోగపడుతుందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు సహకారంతో అత్యాధునికంగా దవాఖాన నిర్మిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు, కార్పొరేటర్లు మెట్టు కుమార్‌యాదవ్, పుష్పానగేశ్, సింధూఆదర్శ్‌రెడ్డి, కంకర శ్రీను తదితరులు పాల్గొన్నారు.