సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 12 : జిల్లాలో ఎన్నికల కమిషన్ నిబంధనలను విధిగా పాటించాల్సిందేనని సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శరత్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇంజినీరింగ్ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని గుర్తు చేశారు. ఇంజినీరింగ్ శాఖలు చేపట్టిన వివిధ పనుల్లో గ్రౌండింగ్ పనులు జరుగుతున్న యెడల, ఆయా పనులను చేయవచ్చన్నారు. కొత్తగా ఎలాంటి పనులకు గ్రౌండ్ చేయరాదని ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించరాదన్నారు. ఆయా శాఖల వారీగా చేపట్టిన పథకాల పనులు పూర్తయినవి, ప్రారంభమై పురోగతిలో ఉన్నవి, ఇంకా గ్రౌం డింగ్ కాని పనుల వివరాలను వెంటనే అందించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులకు ర్యాంపు ఉండాలని, తాగునీటి సరఫరా సమస్యలు ఉంటే రెండు రోజుల్లో మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అధికారులు చంద్రశేఖర్, నగేశ్, రవీందర్రెడ్డి, ఇంజినీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.