సంగారెడ్డి, జనవరి 17(నమస్తే తెలంగాణ): పంచాయతీలకు త్వరలో ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం గ్రామాల్లో పొలిటికల్ హీట్ పెంచుతున్నది. అధికార యంత్రాంగం పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం అవుతుండడంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నారు. ప్రభుత్వం ప్రకటించనున్న పంచాయతీ రిజర్వేషన్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కులగణన సర్వే నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండడంతో ఆశావహుల్లో రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది.
త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారన్న ప్రచారం సాగుతుండటంతో సర్పంచ్‌కు పోటీ చేయాలనుకునే నేతలు ప్రజల్లో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటినుంచే గ్రామాల్లో పెద్దఎత్తున ఖర్చు పెడుతున్నారు. సర్పంచ్‌గా పోటీ చేయాలనుకుంటున్న నాయకులు గ్రామాల్లో పెండ్లిండ్లు, పండుగలు, జాతర్లకు ఆర్థిక సహాయం చేస్తూ, అన్నివర్గాల మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ సర్పంచ్‌లతోపాటు గతంలో సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓటమిపాలైన నాయకులు పంచాయతీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. రిజర్వేషన్లు కలిసివస్తాయని మరికొంత మంది నాయకులు పంచాయతీ బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నారు.
దీంతో గ్రామాల్లో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 647 పంచాయతీలు ఉన్నాయి. జిల్లాలో ఇటీవల 11 పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం అయ్యాయి. అంతే మొత్తంలో కొత్తగా 11 పంచాయతీలు ఏర్పాటు అయ్యాయి. దీంతో జిల్లాలో పంచాయతీల సంఖ్య యథావిధిగా 647 గానే ఉంది. ఆయా పంచాయతీల పరిధిలో మొత్తం 5,732 పంచాయతీ వార్డులు ఉన్నాయి. జిల్లాలోని 647 పంచాయతీ సర్పంచ్ల పదవీకాలం ముగిసి ఏడాది కావస్తుంది. దీంతో అందరి దృష్టి పంచాయతీ ఎన్నికలపైనే నెలకొంది. ప్రభుత్వం త్వరలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల పంచాయతీల ఓటర్ల జాబితాను ప్రకటించటంతోపాటు అధికార యంత్రాంగం పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేస్తుంది.
10 లక్షల బ్యాలెట్ పత్రాలు… 3,285 బ్యాలెట్ బాక్సులు
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం వేగంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇటీవల ఎన్నికల సంఘం పంచాయతీ ఓటర్ల జాబితాను ప్రకటించింది. సంగారెడ్డి జిల్లాలో 14,40,151 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 7,21,186 మంది పురుష, 7,18,827 మహిళా ఓటర్లు ఉన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పంచాయతీ శాఖ అధికారులు 5,732 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. పంచాయతీ శాఖ అధికారులు 3,285 బ్యాలెట్ బాక్సులను సమకూర్చుకుంటున్నారు. అదనంగా మరిన్ని బ్యాలెట్ బాక్సులు అవసరమైతే వాటిని సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల కోసం 10 లక్షల బ్యాలెట్ పత్రాల ముద్రణ ప్రారంభించారు. మొత్తం 30 గుర్తులతో బ్యాలెట్ పత్రాలను ముద్రిస్తున్నారు. సర్పంచ్‌లకు 5 లక్షలు, వార్డు సభ్యులకు 5 లక్షల చొప్పున 10 లక్షల బ్యాలెట్ పత్రాల ముద్రణ పనులు ప్రారంభం అయ్యాయి. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం 7,300 మంది పోలింగ్ సిబ్బంది అవసరం అవుతారని పంచాయతీ శాఖ అంచనా వేసింది. అందుకుఅనుగుణంగా ఎన్నికల సిబ్బంది జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపైనే అందరి దృష్టి నెలకొంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేద్దామనుకుంటున్న నాయకులు పంచాయతీ రిజర్వేషన్లు ఎప్పుడు ప్రకటిస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్‌పై నాయకులు, ఆశావహులు ముందస్తుగానే అంచనా వేసేవారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన అనంతరం పంచాయతీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. దీంతో జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు ప్రభుత్వం రిజర్వేషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా సర్పంచ్, ఉపసర్పంచ్ పదవి ఆశిస్తున్న నాయకులు రిజర్వేషన్ల కోసం ఎదురుచూస్తూనే, మరోవైపు ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు. ఎన్నికల్లో తాము బరిలో ఉంటామని చెప్పుకుంటూ ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల కోసం జోరుగా ఇప్పటినుంచే ఖర్చు పెడుతున్నారు. దీంతో గ్రామాల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.