సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 17: త్యాగాల ఫలితమే తెలంగాణ అని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. మంగళవారం సంగారెడ్డిలో ప్రజాపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్యఅతిథిగా హాజరై కలెక్టరేట్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజా పాలన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రగతిని, సెప్టెంబర్ 17 ప్రాముఖ్యతను వివరించారు. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాపాలన ఆవిర్భావానికి నాంది పలికిన అమరులకు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు, స్వతంత్ర సమరయోధులకు మంత్రి జోహార్లు తెలిపారు.
ప్రజాపాలన వైపు అడుగులు వేస్తూ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉన్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమంపైనే నిరంతరం దృష్టి సారిస్తుందన్నారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ అం చెలంచెలుగా లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందిస్తూ విజయవంతంగా ఆరు గ్యారెంటీల పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నామని వివరించారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతు రుణమాఫీని చేపట్టి రైతులకు భరోసా కల్పించామని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాల అమలు లో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తూ అభివృద్ధి కోసం ఎల్లవేళలా అంకితభావంతో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ పాలన యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. వేడుకల్లో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి జెడ్పీ కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.