Sangareddy | కంది, మార్చి 21 : సంగారెడ్డి పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా, నిరంతరంగా శుద్ధమైన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మిషన్ భగీరథ ఇంజనీర్లు, మున్సిపల్ అధికారులతో కలిసి మిషన్ భగీరథ పంప్‌హౌస్ వద్ద సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి సమస్యరాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను నిరంతరాయంగా కొనసాగించాలన్నారు. పరిశుభ్రమైన నీటిని అందించడంతో పాటు నీటి వృధాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. సంగారెడ్డి పట్టణం డ్రైవర్స్ కాలనీలోని మిషన్ భగీరథ పంప్‌హౌస్ పనితీరును పరిశీలించారు.నీటి సరఫరాతో పాటు పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపర్చేందుకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని మున్సిపల్ కమీషనర్‌ను కలెక్టర్ ఆదేశించారు.సమావేశంలో మిషన్ భగీరథ ఎస్ఈ రఘువీర్, ఈఈ విజయలక్షీ, మున్సిపల్ కమీషనర్ చవాన్, డిప్యూటీ ఇంజనీర్ ఇంతియాజ్, పబ్లిక్ హెల్త్ అధికారి కృష్ణమోహన్, ఏఈ రఘువీర్ పాల్గొన్నారు.