సిద్దిపేట, జూన్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇసుక దందా మూడు పువ్వులు..ఆరు కాయలుగా సాగుతోంది. సిద్దిపేట జిల్లా రాజీవ్ రహదారిపై అధిక లోడ్‌తో ఇసుక అక్రమ లారీలు దూసుకుపోతున్నాయి. రాజీవ్ రహదారి పక్కన అడ్డాలు ఏర్పాటు చేసుకుని ఇసుక దందా సాగిస్తూ అధికార యంత్రాంగం చోద్యం చూస్తున్నది. ఇసుక దందాతో రాజీవ్ రహదారి వెంట ఉన్న పోలీస్స్టేషన్లకు మామూళ్లతో కాసుల వర్షం కురుస్తున్నది. సిద్దిపేట జిల్లాలోని నంగునూరు, మద్దూరు, ధూళిమిట్ట, చేర్యాల, కోహెడ మండలాల మీదుగా వెళ్లే మోయతుమ్మద వాగు నుంచి నిత్యం వందల కొద్ది ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలుతున్నది.
బెజ్జంకి మండలంలో ఇసుక దందా జోరుగా సాగుతున్నది. మెదక్ జిల్లాలో వెల్దుర్తి, కొల్చారం మండలాల్లో ఇసుక దందా నడుస్తున్నది. దందాకు స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనుమతుల పేరిట ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. దందాపై ప్రశ్నిస్తే ఇసుక మాఫియా బెదిరింపులకు పాల్పడుతున్నది. ఇసుక, మట్టి మాఫియా గ్యాంగ్‌లు రెచ్చిపోతున్నా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్త్తినట్లు వ్యవహరిస్తున్నారు.
ఇసుక దందా పేరిట భారీగా అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాగు పరీవాహక ప్రాంతం నుంచి 5 కిలోమీటర్ల వరకు ఒక ట్రాక్టర్ ట్రిప్‌నకు రూ. 3 వేల నుంచి రూ.3500 వరకు తీసుకుంటున్నారు. 20కిలోమీటర్ల లోపు రూ. 5 వేల నుంచి రూ. వేల వరకు దూరాన్ని బట్టి వసూలు చేస్తున్నారు. ఇక వాగులో నుంచి ఇసుక తీసుకురావడానికి రైతుల పొలాల నుంచి వాహనాలు రావాల్సి ఉంటుంది. రైతులు వింటే వారి పొలం నుంచి వాహనం పోయినందుకు ట్రిప్పునకు రూ. 200 నుంచి రూ. 300 చెల్లిస్తున్నారు. వినకపోతే బెదిరిస్తున్నారు. పోలీసులకు, రెవెన్యూ అధికారులకు నెలనెలా మామూళ్లు అందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ట్రాక్టర్ ఇసుకకు రూ. 5వేల నుంచి రూ. 8వేలు ఇస్తున్నారు.
తూతూమంత్రంగా టాస్క్‌ఫోర్స్‌లు
ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లకు కనీసం నెంబర్ప్లేట్లు ఉండడం లేదు. వ్యవసాయ ట్రాక్టర్ల ద్వారానే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. వాగుల నుంచి నిత్యం వందల కొద్ది ట్రాక్టరల్లో ఇసుక తరులుతున్నది.అయినా ఎవరికి పట్టింపు లేదు. పగలురాత్రీ అనే తేడా లేకుండా ఇష్టారీతిగా ఇసుకను తరలిస్తున్నారు. ఇసుక ట్రాక్టర్లు వచ్చిన సమయంలో రోడ్డుపై ఇతర వాహనాలపై వెళ్లాలంటే బయపడాల్సిన పరిస్థితి ఉంది. ఎదురుగా వచ్చి ఎక్కడ ఢీకొడతాయన్న భయం వెంటాడుతున్నది. పిల్లలు, ప్రజలు రహదారిపై వెళ్లాలంటేనే వణికి పోతున్నారు.‘వాల్టా’ చట్టానికి తూట్లు పొడుస్తూ ఇష్టారీతిగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. అడ్డుకుంటే దాడులకు దిగుతున్నారు.
ఇసుక మాఫియా ఆగడాలపై ఇటీవల ఒక ఎస్సైకి ఫిర్యాదు చేసేందుకు కొందరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే అక్కడ కనీసం ఫిర్యాదు తీసుకోలేదు. ఫిర్యాదు కాపీని తీసుకోండి సార్ అంటే ..ఆ ఎస్సై ఏదో మొహమాటానికి తీసుకున్నారు. ఇలా తీసుకున్నారో లేదో..అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఎస్సై చేతిలో నుంచి ఫిర్యాదు కాపీని లాక్కున్నారు. దీనిని బట్టి పోలీసులు కూడా ఇసుక మాఫియాతో ఎంత కుమ్మక్కు అయ్యారో అర్థమవుతున్నది. జిల్లాలో ఇసుక, మట్టి, గంజాయి తదితర వాటి నియంత్రణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌లు నామమాత్రంగానే పనిచేస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్ క్షేత్రస్థాయి సిబ్బంది ఇసుక మాఫియాకు లొంగిపోయి ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక ట్రాక్టర్‌కు నెలకు రూ. 5 వేల వరకు ఇస్తున్నట్లు సమాచారం. ఒక్కో మండలంలో సరాసరి 100 వరకు ట్రాక్టర్ల వరకు ఉన్నాయి. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో అధికంగా ఇస్తున్నారు.
డ్రైవర్లు అంతా మైనర్లే…
ఇసుక మాఫియా యువతను బాగా వాడుకుంటున్నది. పేద పిల్లలను, జులాయిగా తిరిగే వారిని మచ్చిక చేసుకొని వారికి డబ్బుల ఎర చూపుతున్నది. దీంతో యువత ఇసుక యాఫియా ఆడించినట్లు ఆడుతున్నారు. వీరికి కనీసం డ్రైవింగ్ లైసెన్స్‌లు ఉండకున్నా ట్రాక్టర్లు నడిపిస్తున్నారు. వారిని పనిలో దించే ముందు మందు, గంజాయి తాగిస్తూ, బిర్యాని తినిపిస్తున్నారు. వారితో రాత్రి పూట ట్రాక్టర్లను నడిపిస్తున్నారు. ఆ మత్తులో ట్రాక్టర్‌ను స్పీడ్‌గా తరలిస్తున్నారు. ఎదురుగా ఇతర వాహనాలు వస్తున్న విషయం కూడా గమనించడం లేదు. ఎవరైనా ఇసుక ట్రాక్టరును అపితే అదే స్పీడ్‌తో గుద్దె ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
పేరు స్థానిక అవసరాలకు…
స్థానిక అవసరాల పేరుతో వాగుల నుంచి ఇసుకను భారీగా తోడి తరలిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల ప్రోద్భలంతో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నది. అధికారులు మామూళ్లు తీసుకొని ఇష్టారీతిగా స్థానిక అవసరాల పేరిట పర్మిషన్లు ఇస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఇసుక తరలించాల్సి ఉంటుంది. పర్మిషన్ ఎక్కడి వరకు ఉందో అక్కడికి మాత్రమే తరలించారు. కానీ, అది ఎక్కడా అలా జరగడం లేదు. పర్మిషన్ ఓ రెండు ట్రిప్పులు ఉంటే, దాని పేరు మీద 20 నుంచి 50 ట్రిప్పుల వరకు ఇసుకను తరలిస్తున్నారు.
అధికారుల కనుసన్నుల్లోనే రవాణా
వాగుల నుంచి ఇసుకను తరలించే ముందు రూట్‌క్లియర్ చేసుకుంటారు. ఐదారు ట్రాక్టర్ల యజమానులకు కలిపి ఒక గ్యాంగ్ ఉంటుంది. ట్రాక్టర్లలో ఇసుకను సిద్ధం చేసుకున్నాక.. ఆ గ్యాంగ్ ముందుగా ఒక కారులో పోతారు. రూట్ క్లియర్ అని గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగానే ట్రాక్టర్లు బయలు దేరుతాయి.ఈ విషయం పోలీసులకు ముందే సమాచారం ఉంటుంది. ఆ ట్రాక్టర్లు ఒక రూట్లో పోతే మరోరూట్లో పోలీసులు వెళ్తారు. దీంతో ఆ ట్రాక్టర్లు చేరాల్సిన చోటుకు చేరిపోతాయి. గ్రామాల నుంచి రైతులు పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగానే, వస్త్తామని చెప్పి ముందుగానే ట్రాక్టర్ల వాళ్లకు సమాచారం ఇస్తున్నారు. తీరా పోలీసులు అక్కడికి పోయేసరికి ఒక్క ట్రాక్టరు ఉండదు. ఇసుక మాఫియా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ దందా సాగిస్తున్నారు. వర్షాలు వస్తే వాగులు నిండుతాయని చెప్పి ముందుగానే కావాల్సిన ఇసుకను వాగు నుంచి తోడి సమీప ప్రాంతాల్లో వారికి అనువైన ప్రదేశాల్లో డంప్ చేస్తున్నారు. ఎక్కడ చూసిన వాగు పరీవాహక ప్రాంతాల్లో ఇసుక డంప్‌లు కనిపిస్తున్నాయి. పక్కనే ఉన్న రైతులు ఎవరికైనా చెబితే మీఅంతు చూస్తాం అంటూ ఇసుక మాఫియా బెదిరింపులకు పాల్పడుతున్నది.