తెలంగాణపై బీజేపీ సర్కారు కక్షసాధింపు ధోరణిని నిరసిస్తూ నేడు అన్ని జిల్లాకేంద్రాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆధ్వర్యంలో రైతు మహాధర్నా చేపట్టనున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రైతులతో కలిసి మహాధర్నాలో పార్టీ శ్రేణులు పాల్గొంటాయి. సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉదయం 10గంటలకు జరిగే ధర్నాలో మంత్రి హరీశ్‌రావు పాల్గొంటారు. మెదక్‌లోని రాందాస్ చౌరస్తాలో పద్మాదేవేందర్‌రెడ్డి, సంగారెడ్డిలోని ఆర్డీవో ఆఫీస్ వద్ద చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి బీజేపీ సర్కారు తీరును ఎండగడతారు. తెలంగాణ రైతులు నిర్మించుకున్న కల్లాల డబ్బులు వెనక్కి ఇవ్వాలని కేంద్రం పేచీ పెట్టడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కల్లాల నిధులు వెనక్కి ఇవ్వాలని అడగడం బీజేపీకి రైతుల మీద ఎంతటి ప్రేమ ఉందో తెలియజేస్తున్నదని బీఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు. నేడు నిర్వహించే మహాధర్నాకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
సిద్దిపేట, డిసెంబర్ 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు నిరసనగా శుక్రవారం (నేడు) అన్ని జిల్లా కేంద్రాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా చేపట్టనున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సిద్దిపేట,మెదక్, సంగారెడ్డి జిల్లాకేంద్రాల్లో రైతులతో కలిసి మహాధర్నా నిర్వహించడానికి పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. ఆయా జిల్లాకేంద్రాల్లో చేపట్టే ధర్నా కార్యక్రమాల్లో రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్త ప్రభాకర్‌రెడ్డి (సిద్దిపేట), పద్మాదేవేందర్‌రెడ్డి (మెదక్), చింతా ప్రభాకర్(సంగారెడ్డి)లతో కలిసి జిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ప్రజాప్రతినిధులు, రైతు బంధు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు వివిధ హోదాల్లో పార్టీ నేతలంతా ఈ ధర్నాలో పాల్గొననున్నారు. రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి మహాధర్నాను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉదయం శుక్రవారం 10గంటలకు నిర్వహించే ధర్నాలో మంత్రి హరీశ్‌రావు పాల్గొంటారని పార్టీ శ్రేణులు తెలిపాయి.
బాగుపడుతున్న తెలంగాణ రైతుపై కేంద్రం కక్ష…
సీఎం కేసీఆర్ నాయకత్వలో తెలంగాణలో వ్యవసాయరంగానికి ఇప్పుడిప్పుడే మంచిరోజులు వచ్చి రైతులు నిలదొక్కుకుంటున్నారు. ఇది చూసి ఓర్వలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కండ్లు మండుతున్నాయి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పంటలు పండుతున్నాయి. ప్రతి ఎకరాకూ సాగునీరు అందించి సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వయంగా సీఎం కేసీఆర్ కేంద్రానికి అనేకసార్లు విజ్ఞప్తి చేశారు. అనేక విజ్ఞాపనలు పంపినా కేంద్ర సర్కారు మొరపెట్టుకోవడం లేదు. అనుక్షణం రైతుల సంక్షేమం గురించి ఆలోచిస్తున్న సీఎం కేసీఆర్, రైతులకు ధాన్యం నూర్పిళ్లకు ఇబ్బందులు కలగవద్దని కల్లాలు నిర్మించుకునేలా చేశారు. ఉపాధిహామీ పథకంలో ఉన్న నిబంధనలకు అనుగుణంగా వ్యవసాయరంగానికి నిధులు ఖర్చు చేశారు. ఆ నిబంధన ప్రకారంమే రైతులు వ్యవసాయ కల్లాలను నిర్మించుకున్నారు. ఇది చూసి ఓర్వలేని మోదీ సర్కారు.. రైతులు నిర్మించుకున్న కల్లాల డబ్బులు తిరిగి వెనక్కి ఇవ్వాలని పేచీ పెడుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కల్లాల మీద ఖర్చు చేసిన రూ.151 కోట్లు తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపింది. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు నిర్మించుకున్న కలాల నిధులు వెనక్కి ఇవ్వాలని అడగడం బీజేపీకి రైతుల మీద ఎంతటి ప్రేమ ఉందో తెలియజేస్తున్నదని బీఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు.
రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న కల్లాలపై బీజేపీ రాజకీయం చేయడం కేంద్ర ప్రభుత్వ దిగజారుడు రాజకీయాలకు నిదర్శమని రైతు నేతలు పేర్కొంటున్నారు. తమను ప్రశ్నిస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై కక్షతోనే కేంద్రం ఇలా చేస్తున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ర్టాల్లో కల్లాలు నిర్మించుకుంటే ఓకే అన్న కేంద్ర సర్కారు, తెలంగాణను ఇబ్బందులు పెట్టాలని చూడడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మోదీ సర్కారు కక్ష పూరితంగా వ్యవహరిస్తూ ఆరునెలలుగా ఉపాధిహామీ నిధులు ఇవ్వకుండా తెలంగాణను ఇబ్బందులకు గురిచేస్తున్నది. దీంతో ఉపాధిహామీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో రైతుల వడ్లు కొనుగోలు చేయమంటే బీజేపీ సర్కారు నానా యాగీ చేసింది. చివరకు వడ్లు కొనుగోలు చేయలేదు. రైతులు నష్టపోవద్దనే పెద్ద మనసుతో సీఎం కేసీఆర్ ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారు. బీఆర్ఎస్ సర్కారు రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తుంటే .. కేంద్రం కక్షసాధింపులకు దిగుతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంతో కేంద్ర సర్కారు తీరును ఎండగడుతూ నేడు నిర్వహించే మహాధర్నాకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది.
తెలంగాణపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న కేంద్ర సర్కారు తీరును ఎండగడతాం. రైతులు నిర్మించుకున్న కల్లాలపై బీజేపీ సర్కారు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నది. ఒక మంచి కార్యక్రమాన్ని అభినందించాల్సింది పోయి కక్ష సాధింపులకు దిగడం ఎంత వరకు సమంజసం. రైతులకు తెలంగాణ ప్రభుత్వం చేసిన సహాయాన్ని ఉపాధిహామీ నిధుల మళ్లింపు అంటూ కేంద్రం దుష్ప్రచారం చేస్తున్నది. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసింది. సీఎం కేసీఆర్ ఎన్నో లేఖలు రాశారు. అయినా కేంద్రం పట్టించుకోవడం లేదు. నేటి ధర్నాలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలి.
– కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు