జహీరాబాద్, నవంబర్ 6: పెద్దలు పేకాడితే ఇది కాలక్షేపం.. సామాన్యులు ఆడితే మాత్రం అది జూదం.. ఇదీ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని హద్నూర్ పోలీసుల తీరు. చట్టం అందరికీ సమానం అంటూ ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇచ్చే పోలీసులు ఆర్థికంగా, రాజకీయంగా పేరున్న వ్యక్తులు అనుమతి లేకుండా క్లబ్లో పేకాడినా పట్టించుకోవడం లేదు. సామాన్యులెవరైనా చెట్ల కింద, ఆరుబయట, ఇండ్లలో పేకాడితే వేటాడి, వెంటాడి పట్టుకుంటున్నారు. తెలంగాణలో పేకాట క్లబ్‌లకు అనుమతి లేకపోవడంతో చాలామంది జూదరులు పేకాడేందుకు మహారాష్ట్రలోని క్లబ్‌లకు వెళ్తున్నారు.
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట క్లబ్ నిర్వహిస్తున్నారే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల తెలంగాణ సరిహద్దులోని న్యాల్కల్ మండలంలోని రాజోలా గ్రామ శివారులో పేకాట స్థావరం పోలీసులు దాడిచేసి పెద్ద మొత్తంలో నగదు, జూదరులను పట్టుకున్నా రు. కానీ, న్యాల్కల్ మండలంలోని మెటల్‌కుంట చౌరస్తా సమీపంలోని ఓ ఫాంహౌస్‌లో కొంతకాలంగా కర్ణాటకకు చెందిన కొందరు గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట క్లబ్‌పై చర్యలు తీసుకోవడం లేదు.
ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంట వరకు కొనసాగుతున్న పేకాట క్లబ్‌కు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారుల అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్థానిక ఫాంహౌస్‌లోని ఏర్పాటు చేసిన పేకాట క్లబ్లో టేబుళ్లు ఏర్పాటు చేసి పేకాట నిర్వహిస్తున్నారు. తెలంగాణ- కర్ణాటకలోని పలు ప్రాంతాలకు చెందిన జూదరులు ఇక్కడికి వచ్చి పేకాట ఆడుతున్నారు. ప్రతిరోజూ పెద్దపెద్ద వ్యాపారులు, ఉద్యోగులు, జూదరులు ఇక్కడికి చేరుకొని భారీ మొత్తంలో బెట్టింగ్ పెడుతున్నట్టు తెలిసింది. పేకాడేందుకు వచ్చే జూదరులకు నిర్వాహకులు అన్ని వసతులు కల్పిస్తున్నారు. పెద్ద మొత్తంలో బెట్టింగ్ జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
పేకాటను ఉపేక్షించం: ఎస్సై
న్యాల్కల్ మండలంలోని మెటల్‌కుంట గ్రామ చౌరస్తా సమీపంలోని ఫాంహౌస్‌లోని పేకాట క్లబ్ నిర్వహణ గురించి హద్నూర్ ఎస్సై సుజిత్‌ను ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా.. ఎంతటి వారైనా పేకాడితే ఉపేక్షించేది లేదన్నారు. మెటల్‌కుంట గ్రామ శివారులోని ఫాంహౌస్‌లో పేకాడుతున్నట్లు తమకు సమాచారం లేదన్నారు. పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో ఎక్కడైనా పేకాడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పేకాట గురించి సమాచారం అందిస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు.