సంగారెడ్డి,జనవరి 23(నమస్తే తెలంగాణ) : హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుబాటకు ఆర్టీసీ కార్మికులు సన్నద్ధవుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నా హామీలు నెరవేర్చడం లేదని ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. ఆర్టీసీ రిటైర్డు ఉద్యోగులు సైతం ప్రభుత్వం తీరుపై నిరసనలు తెలుపుతున్నారు. ఇటీవల తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ రిటైర్డు ఉద్యోగులు ధర్నాలకు దిగారు. తమ ఆందోళనలను మరింత ఉధృతం చేసేందుకు వారంతా సిద్ధమవుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, వేతనాలు పెంచుతామని, కార్మిక సంఘాలను పునరుద్ధరిస్తామని ఎన్నికలప్పుడు రేవంత్రెడ్డి హామీలు ఇచ్చారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో 14వ అంశంగా ఆర్టీసీ హామీలను కాంగ్రెస్ ప్రకటించింది. సీఎం పదవి చేపట్టాక రేవంత్రెడ్డి ఆర్టీసీ కార్మికులను పూర్తిగా మర్చిపోయారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను అటకెక్కించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో అన్ని రకాల బెనిఫిట్స్ అందుతాయి. దీనికోసం కార్మికులు రెండేండ్లుగా ఎదురుచూస్తున్నారు.కానీ, ప్రభుత్వం విలీనం ఊసే ఎత్తడం లేదు. దీంతో రేవంత్ సర్కార్ తీరుపై ఆర్టీసీ కార్మికులు భగ్గుమంటున్నారు. వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో తమ సమస్యలు ఉంటే యూనియన్ దృష్టికి తీసుకెళ్లే వారు, యూనియన్ నాయకులు డిపోమేనేజర్లు, ఆర్ఎంలతో నేరుగా మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపేవారు.
ప్రస్తుతం యూనియన్లు లేకపోవటంతో ఆర్టీసీ కార్మికులు వ్యక్తిగతంగా మాత్రమే ఉన్నతాధికారులను కలిసి సమస్యలను చెప్పుకుంటున్నారు. ఉన్నతాధికారులు కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదు. యూనియన్లు ఉంటే ఈ పరిస్థితి తలెత్తదని, కార్మిక సంఘాలు ధర్నాలు, ఆందోళనలు చేసి సమస్యలు పరిష్కరించేందుకు వీలు ఉండేవదని కార్మికులు చెబుతున్నారు. ప్రస్తుతం యూనియన్లు లేకపోవటంతో ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కార్మిక సంఘాలను పునరుద్ధ్దరించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 7 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. 7 డిపోల్లో మొత్తం 2500 మందికిపైగా డ్రైవర్లు, కండక్టర్లు పనిచేస్తున్నారు. వీరితో పాటు మరో 200 సిబ్బంది, ఉద్యోగులు, కంట్రోలర్లు తదితరులు పనిచేస్తున్నారు. అధికారంలోకి రాగానే ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, ఇంత వరకు వేతనాలు పెంచలేదు. ఆర్టీసీ కార్మికులు 2021, 2024 పేస్కేల్ రావాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు పేస్కేల్ ప్రకటించలేదు. దీంతో కార్మికులు పేస్కేల్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. 2017 నుంచి ఏరియర్స్ కార్మికులు రావాల్సి ఉండగా, ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఆర్టీసీలో ప్రభుత్వం కొత్తగా డ్రైవర్లు, కండక్టర్ల నియామకం చేపట్టలేదు.
మరోవైపు రిటైర్మెంట్ అవుతున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతున్నది. దీంతో ఆర్టీసీ డిపోల్లో కండక్టర్లు, డ్రైవర్ల సంఖ్య తగ్గుతున్నది. ప్రస్తుతం ఉన్న కార్మికులపై పని ఒత్తిడి విపరీతంగా పెరిగింది. ఔట్సోర్సింగ్లో డ్రైవర్లను తీసుకుంటున్నప్పటికీ, వారి పనితీరు సరిగ్గా లేకపోవడంతో పాటు తరుచూ ప్రమాదాలకు కారణం అవుతున్నట్లు తెలిసింది. ఆర్ఎం కార్యాలయం, డీఎం కార్యాలయాల్లో సైతం ఉద్యోగుల సంఖ్య తగ్గటంతో సీనియర్ కండక్టర్లను వారి స్థానాల్లో ఓడీ సూపర్వైజర్లుగా నియమిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే కొత్త నియామకాలు చేపట్టి పనిఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆర్టీసీ రిటైర్డు ఉద్యోగులు కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇటీవల సంగారెడ్డిలో ఆర్ఎం కార్యాలయం ఎదుట, నర్సాపూర్, గజ్వేల్,మెదక్ డిపోల ఎదుట రిటైర్డు ఉద్యోగులు ధర్నా చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలను ఉధృతం చేసేందుకు రిటైర్డు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. 2017 రివైజ్డ్ పేస్కేల్ బకాయిలు రిటైర్డు ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించలేదు. 2021 పీఆర్సీ అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నది.
జిల్లాలో రిటైర్డు ఆర్టీసీ కార్మికులకు చాలా మందికి ఇంకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదు. దీంతో తమకు రావాల్సిన బకాయిలు చెల్లించటంతో పాటు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు వెంటనే బెపినిట్స్ చెల్లించాలని, అందరికీ తార్నాక ఆర్టీసీ దవాఖానలో వైద్యసేవలు అమలు చేయాలని రిటైర్డు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం ప్రారంభించిన తర్వాత రద్దీ పెరగడంతో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పరిమితికి మించి బస్సుల్లో ప్రయాణికులు ఎక్కుతుండడంతో తరుచూ బస్సులు మొరాయిస్తున్నాయి.