అందోల్, నవంబర్ 29: ప్రయాణికులతో వెళ్తున ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో పలువురు గాయపడిన సంఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని కన్సాన్పల్లి శివారులో జరిగింది. ప్రమాదానికి సంబంధించి ఆర్టీసీ కండక్టర్, ప్రయాణికులు తెలిపిన వివరాలు.. నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శుక్రవారం 55 మంది ప్రయాణికులతో లింగంపల్లి బయలుదేరింది. బస్సు 161 జాతీయ రహదారిపై వెళ్తున్న క్రమంలో కన్సాన్పల్లి వద్ద ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు డివైడర్‌పై దూసుకెళ్లింది. దీంతో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు కేకలు వేశారు.
డైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడడంతో కొంతమందికి స్వల్పంగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు అలాగే ఇంకొంచం ముందుకు వెళ్లి కిందకు పడితే పెద్ద ప్రమాదమే జరిగేదని, డివైడర్‌పై ఆగడంతో ప్రమాదం తప్పిందని ప్రయాణికులు చెప్పారు. నేషనల్ హైవే కావడంతో ప్రమాదం జరిగిన వెంటనే ఇతర వాహనదారులు బస్సులోనుంచి ప్రయాణికులను కిందకు దింపి పోలీసులు, 108కి సమాచారం అందించి సహాయక చర్యలో పాల్గొన్నారు. క్షతగాత్రులను జోగిపేట దవాఖానకు తరలించి చికిత్స అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న జోగిపేట పోలీసులు ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బస్సు డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా బస్సు నడపడమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు తెలిపారు.