సంగారెడ్డి, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రూ.364 కోట్ల నిధులు విడుదల చేశారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నారాయణఖేడ్‌లో జరిగిన బహిరంగ సభలో సం గారెడ్డి జిల్లాలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్‌ను తాను కోరినట్లు మంత్రి చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి పనులకు రూ.364.80 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ మేరకు బుధవారం జీవో 61 సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్(ఎస్డీఎఫ్) కింద రూ.100 కోట్లు నిధులు విడుదల చేశారు. సదాశివపేట, నారాయణఖేడ్, అందోలు, తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఒక్కో మున్సిపాలిటీకి రూ.25 కోట్ల చొప్పున మొత్తం రూ.125 కోట్ల నిధులను ప్రభుత్వం ఎస్డీఎఫ్ కింద విడుదల చేసింది. సంగారెడ్డి జిల్లాలోని 699 పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలుగా ఒక్కో గ్రామానికి రూ.20 లక్షల చొప్పున రూ.139. 80 కోట్ల నిధులు విడుదలయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోని పంచాయతీలు, ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ రూ.364.80 కోట్ల నిధులు విడుదల చేయడంతో మంత్రి హరీశ్‌రావు, జిల్లా ప్రజల పక్షాన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ జిల్లాకు కేటాయించిన నిధులను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటామన్నారు. ఇందుకోసం తాను త్వరలోనే స్థానిక ఎమ్మెల్యేలు, మున్సిపల్ పాలకవర్గ సభ్యులతో సమావేశమై అభివృద్ధిపై చర్చిస్తామన్నారు. గ్రామాల్లో నిధులు ఎలా సద్వినియోగం చేయాలో.. అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.