మెదక్ రూరల్, మే 23 : అధ్వాన రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మెదక్ జిల్లా కేంద్రం నుండి తిమ్మక్కపల్లి, బాలా నగర్ గ్రామాలకు వెళ్లే రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మండలంలోని ఆయా గ్రామాల రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. అలాగే పాతూర్ నుండి రాయన్ పల్లి గ్రామానికి వెళ్లేందుకు మూడు
కిలోమీటర్ల రోడ్డుకు గంట ప్రయాణం చేయాల్సివస్తోంది.
మండలంలోని గ్రామాలకు వెళ్లే రోడ్లు అధ్వానంగా మారి పలుమార్లు ప్రమాదాలు కూడా జరిగాయి. రోడ్లు సరిగా లేక గుంతల మయంగా మారటంతో ఇటీవల వర్షాలు పడడంతో రహదారి మరీ దారుణంగా తయారైంది. పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లోని అంతర్గత రోడ్లను మరమ్మతులు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.