మెదక్, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు ధ్వంసమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు తీవ్రంగా దెబ్బతినడంతో రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టడానికి నిధుల కోసం పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖల అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు నివేదించారు. పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన మెదక్-బొడ్మట్‌పల్లి రహదారిలో 150 మీటర్ల రోడ్డు కోతకు గురైంది. నార్సింగి నుంచి పెద్దశంకరంపేట వెళ్లే రోడ్డు ధ్వంసమైంది.
శివ్వంపేట మండలం కంది-కానుకుంట రోడ్డులో నవాబ్‌పేట వద్ద, శివ్వంపేట మండలం రాజన్నవాగు వంతెన, చిన్నగొట్టముక్కల చాకరిమెట్ల ఆలయం వద్ద రోడ్డు దెబ్బతిన్నది. హవేళీఘనపూర్ మండలం దూప్‌సింగ్ తండాకు వెళ్లే దారిలో వాగు వంతెన రోడ్డు తెగిపోయి ఇబ్బందిగా మారింది. పిల్లికోటాల్-వెల్దుర్తి చంది మార్గంలో పోతులబొగుడ వద్ద రోడ్డు కొట్టుకుపోయింది. పంచాయతీరాజ్‌శాఖ తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.40 లక్షలతో అంచనాలు వేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
మెదక్ జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో వర్షాలకు రోడ్లు దెబ్బతినగా, కొన్ని ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమై ప్రయాణానికి ఇబ్బందికరంగా మా రాయి. ఎక్కువగా మెదక్-బొడ్మట్‌పల్లి, పాపన్నపేట-నార్సింగి-పెద్దశంకరంపేట వెళ్లే రోడ్లు పూర్తిగా ధ్వంసంకాగా, ప్రయాణం నరకంగా మారిందని వాహనదారులు వాపోతున్నారు. గుంతల్లో పడి ప్రమాదాలు జరుగుతున్న సంఘటనలు ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.