చౌటకూర్, జూలై 23: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ నుంచి హత్నూర మండలం కొన్యాల గ్రామానికి వెళ్లే రహదారికి మోక్షం కలగడం లేదు. రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చౌటకూర్ నుంచి సమీపంలోని మంజీరా తీరానికి వెళ్లేందుకు గల ధన్రాస్తా నిర్మాణానికి ప్రభుత్వం గతేడాది అక్టోబరులో కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్ (సీఆర్ఆర్) కింద రూ.2.10 కోట్లు మంజూరు చేసింది. నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంతో రాకపోకలకు వాహనదారులు, రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.
నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్‌తో పాటు హత్నూర, దౌల్తాబాద్లకు వెళ్లేందుకు ఈ రహదారి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎన్నో దశబ్దాలుగా బండ్లబాట (ధన్రాస్తా)గా ఉన్న మూడు కిలోమీటర్ల రహదారిని గతంలో ఫార్మేషన్ చేసి కంకర రోడ్డుగా నిర్మాణం చేపట్టారు. ఇక అప్పటి నుంచి అలాగే వదిలేయడంతో రోడ్డు పూర్తిగా ధ్వంసమై నడిచేందుకు వీలు లేకుండా మారింది. చౌటకూర్ గ్రామ శివారు భూములు మంజీర నది తీరం వరకు ఉన్నాయి.
రైతులతో పాటు హత్నూర మండలం కొన్యాల, పన్యాల తదితర గ్రామాల ప్రజలు నిత్యం జోగిపేట, సంగారెడ్డి పట్టణాలకు ఈ రహదారి గుండానే వెళ్తుంటారు. ఏండ్ల్ల క్రితం ధ్వంసమైన రహదారికి నిధులు మంజూరయ్యాయని సంతోషపడిన ఈ ప్రాంత ప్రజలకు నిరాశే మిగిలింది. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.2.10 కోట్ల నిధులు మురిగిపోతున్నాయి. ధన్రాస్తాను బాగు చేయడం ద్వారా వేలాది మందికి ప్రయోజనకరంగా ఉంటుందన్న వాస్తవాన్ని గ్రహించకుండా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పుల్కల్, చౌటకూర్, అందోలు మండలాల ప్రజలు నర్సాపూర్ పట్టణానికి వెళ్లాలంటే జోగిపేట లేదా సంగారెడ్డి మీదుగా వెళ్తుంటారు.చౌటకూర్ నుంచి సంగారెడ్డి ఎంఎన్ఆర్ చౌరస్తా వరకు 20 కిలోమీటర్లు, అక్కడి నుంచి మరో 30 కిలోమీటర్లు, మొత్తంగా 50 కిలోమీటర్లు దూరం ప్రయాణించి నర్సాపూర్‌కు చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ రహదారిని ఏర్పాటు చేయడం ద్వారా 20 కిలో మీటర్లు దూరం తగ్గనున్నది. ధన్రాస్తాను ఇరువైపులా కొంత మేరకు విస్తరించి 25 ఫీట్లుగా వెడల్పు చేస్తే వాహనాలు ఎదురెదురుగా వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఈ రహదారి ఎప్పుడు పూర్తవుతుందా అని రైతులు, ప్రజలు ఎదురు చూస్తున్నారు.