సంగారెడ్డి, అక్టోబర్ 6: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సంగారెడ్డిలోని ఎర్రకుంటపై భాగంలో ఉన్న నివాసాల్లోకి వరద చేరి ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. వరద తో ఇండ్ల నుంచి బయటికి రాలేక శ్రీచక్ర కాలనీ, రెవెన్యూ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద ముంపునకు గురైన కాలనీల్లో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పర్యటించి సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.
ఆయన ఆదేశాలతో వరద నీటి ని తొలిగించేందుకు వెంటనే పీఆర్ ఇంజినీరింగ్, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు సమన్వయంతో మల్కాపూర్ నుంచి రాజంపేటకు వచ్చే పీఆర్ రోడ్డును తవ్వేశారు. కానీ, తవ్విన రోడ్డును పునర్మించడానికి చర్య లు తీసుకోకపోవడంతో ఈ రోడ్డు గుండా రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నా యి. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. గతంలో మల్కాపూర్ నుంచి రాజంపేట వయా సంగారెడ్డికి రావాలంటే ఈ రోడ్డు గుండా రవాణా చేసేవారు.
కానీ, రోడ్డును తవ్వడంతో వారి ప్రయాణానికి బ్రేక్‌పడింది. వరదతో దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. మున్సిపల్ అధికారులు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు బురదమయంగా మారడంతో వాహనాలు ఇరుక్కుపోతున్నాయి. భారీ వాహనాలు వస్తే ట్రాఫిక్ జామ్ అవుతున్నది. రాత్రి వాహనాలపై వచ్చే ప్రయాణికులు గమనించకుండా కల్వర్టు గుంతలో పడే ప్రమాదం ఉంది.
గతనెల 9న భారీ వర్షాలకు ఎర్రకుంట పైభాగంలో కాలనీల్లోకి వరద చేరడంతో మల్కాపూర్ నుంచి రాజంపేటకు వచ్చే పీఆర్ రోడ్డుపై కల్వర్టును జేసీబీలతో తవ్వించి నీటిని మళ్లించాం. స్లాబ్ కల్వర్టుకు రూ.48లక్షల నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు రాగానే పనులు ప్రారంభిస్తాం. మున్సిపల్ అధికారులు తాత్కాలిక రోడ్డును ఏర్పాటు చేసి రవాణాకు ఇబ్బందులు లేకుండా చేశారు.
– జగదీశ్వర్, పీఆర్ ఇంజినీర్, సంగారెడ్డి