సిద్దిపేట, నవంబర్ 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరుస రోడ్డు ప్రమాదాలతో జిల్లా ప్రజలు హడలెత్తిపోతున్నారు.మితిమీరిన వేగం ప్రమాదాలకు దారి తీస్తున్నది. పరిమితికి మించి లోడ్‌తో కంకర ట్రిప్పర్లు, ఇసుక లారీలు రోడ్లపై అతి వేగంగా వెళ్తుండడంతో రోడ్డు దెబ్బతినడంతో పాటు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ఈ వారంలోనే కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో జిల్లావాసులు మృతిచెందారు. ఆ ఘటన నుంచి తేరుకుంటుండగా హైదరాబాద్- బీజాపూర్ రోడ్డుపై రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మందికి పైగా మృతిచెందారు. బుధవారం కర్ణాటకలోని హాలికేడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణఖేడ్ మండలం జగన్నాథపూర్‌కు చెందిన నలుగురు వ్యక్తులు మృతిచెందారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగాయి. ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు అయినా రహదారుల మరమ్మతులకు రూపా యి నిధులివ్వలేదు. ఫలితంగా గుంతల రోడ్లపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. వరుసగా కురుస్తున్న వర్షాలకు రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న రహదారులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏదైనా ఘటన జరిగినప్పుడే అధికారులు హడావిడి చేసి, ఆ తర్వాత పట్టించుకోవడం లేదు.
మామూళ్ల మత్తులో అధికారులు ..?
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అధికారులు మామూళ్లకు అలవాటు పడి ఉద్యోగ ధర్నాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. కనీస తనిఖీలు చేయడం లేదు. ఏదో సంఘటన జరిగినప్పుడు ఒకటి రెండు రోజులు హడావిడి చేస్తున్నారు తప్పా శాశ్వత పరిష్కార మార్గాలు చూపడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆర్టీఏ అధి కారులు పూర్తిగా లంచాలకు అలవాటు పడ్డారు. ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకొని దర్జాగా పైసలు వసూలు చేస్తున్నారు. ప్రతిరోజు జిల్లాలో పరిమితి మించి టిప్పర్లు అధిక లోడ్‌తో పోతున్నా అధికారుల చర్యలు శూన్యం. నిత్యం వందల ట్రిప్పులు క్యారీల నుంచి ఇతర జిల్లాలకు కంకర ట్రిప్పర్లు పోతున్నాయి.
అతివేగంగా టిప్పర్లు పోవడంతో తరుచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అతివేగంగా వెళ్తున్న టిప్పర్లను నియంత్రించాల్సిన సంబంధిత శాఖల అధికారులు తమది కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. మామూళ్లకు ఆశపడే వాటిని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో 106 రాయి క్వారీలు, 83 క్రషర్లు ఉన్నాయి.వీటి నుంచి ప్రతిరోజు 700 నుంచి 900 ట్రిప్పుల వరకు రవాణా జరుగుతున్నది. మెదక్ జిల్లాలో 113 క్వారీలు, 95 క్రషర్లు ఉండగా, వీటి నుంచి రోజు 400 ట్రిప్పుల వరకు రవాణా జరుగుతున్నది. ప్రధానంగా మెదక్ జిల్లాలోని తూ ప్రాన్, శివ్వంపేట నుంచి హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు రవాణా జరుగుతున్నది.సంగారెడ్డి జిల్లాలో 131 క్వారీలు, 180 క్రషర్లు ఉండగా, ప్రతిరోజు వీటి ద్వారా 800 నుంచి 900 వరకు ట్రిప్పుల రవాణా జరుగుతున్నది.
ప్రధానంగా పటాన్చెరు పరిసర గ్రామాలైన లక్డారంతో పాటు జిన్నారం మండలంలోని ఖాజీపల్లి, మందారం తదితర గ్రామాల్లోని క్రషర్లు,క్వారీల నుంచి నిత్యం జాతరను తలపించేలా టిప్పర్ల ద్వారా కంకర రవాణా జరుగుతున్నది.ఉమ్మడి మెదక్ జిల్లాలో అనుమతి లేకుండానే పలు క్రషర్లు, క్వారీలు నడుస్తున్నాయి. ఒకదానికి అనుమతి తీసుకొని దాని సమీపంలోనే మరోటి పెట్టి ఒక్కదానిపై రెండు నడిపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.జిల్లాలో మైనింగ్, పోలీస్, రవాణా శాఖ అధికారులకు ప్రతినెలా మామూళ్లు అందుతుండడంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఆర్టీఏ అధికారుల ఇష్టారాజ్యం నడుస్తోంది. ట్రిప్పర్, ఇసుక మాఫియాతో చేతులు కలిపి అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
పటాన్చెరు మండలంలోని లక్డారంలో 35 వరకు ప్రభుత్వ అనుమతి పొందిన క్రషర్లు ఉన్నాయి. అనధికారికంగా మరిన్ని క్రషర్లు ఉన్నాయి. జిన్నారం మండలంలోని ఖాజీపల్లి, మందారం, తదితర గ్రామాలతో పాటుగా సుల్తాన్ పూర్లో క్రషర్లు ఉన్నాయి. ఇవన్నీ పెద్ద నాయకుల క్రషర్లు కావడంతో అధికారుల కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. దగ్గరుండి వాటిని నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. క్రషర్ యజమానుల నుంచి ఒక్కో టిప్పర్‌కు రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ఈ ఒక్క ప్రాంతం నుంచే రోజు 700 వరకు ట్రిప్పుల కంకర రవాణా జరుగుతున్నది. ప్రభుత్వానికి పన్ను లు ఎగ్గొడుతున్నారు. రోజుకు వేల టన్నుల కంకర, డస్ట్, చిప్స్, గ్రానైట్ తరలి వెళ్తున్నది. ఒక వేబిల్ ద్వారానే పదుల సంఖ్యలో ట్రిప్పులు తరలుతున్నది. ఒక టిప్పర్‌లో 35 టన్నుల వరకు పరిమితి. కానీ, ఒక్కో దానిలో 60 నుంచి 70 టన్నుల వరకు తరలిస్తుండడంతో అదుపుతప్పి రోడ్లు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వీటి ద్వారా ఆర్టీఏ, మైనింగ్ అధికారులకు కాసుల వర్షం కురుస్తున్నది.
మితిమీరిన వేగంతో ప్రమాదాలు…
మితిమీరిన వేగంతో వాహనాలు నడపడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లాలోని రాజీవ్ రహదారిపై నిత్యం ఏదో ఒకచోట ప్రమాదం చోటుచేసుకుంటున్నది. సిద్దిపేట జిల్లాలో రాజీవ్ రహదారి 94 కిలోమీటర్ల పొడవు విస్తరించి ఉంది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ మీదు గా మంచిర్యాల వరకు ఈ రోడ్లు వెళ్తుంది. ఈ రోడ్డుపై 80 కి.మీ వేగపరిమితి కానీ, అతివేగంగా వాహనాలు దూసుకెళ్తుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్క డ స్పీడ్ లేజర్ గన్స్ ఉంటున్నాయో వాహనదారులకు తెలిసిపోతున్నది. ఆ ప్రాంతానికి రాగానే తమ స్పీడ్ లిమిట్ తగ్గించి వెళ్తున్నారు. కాళేశ్వరం, కరీంనగర్ నుంచి నిత్యం వందల కొద్ది ఇసుక లారీలు నడుస్తున్నాయి. పరిమితి మించి లోడ్‌తో అతివేగంగా నడుపుతున్నారు.
దీనిని అరికట్టాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో చర్యలు తీసుకోవడం లేదు. రాజీవ్ రహదారి వెంట ఉన్న పోలీస్స్టేషన్లకు కాసుల వర్షం కురుస్తున్నది. ఆర్టీఏ అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.అక్టోబర్‌లో పరీక్ష రాసేందుకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో చిన్నకోడూరు మండలం అనంతసాగర్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ముగ్గురు చనిపోయారు. పాతూరు వద్ద జరిగిన ప్రమాదంలో 11 మంది, దసరా పండుగకు వెళ్లి వస్తూ బెజ్జంకి వద్ద దంపతులు మృతి చెందారు. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా అధికారుల్లో చలనం లేదు. రాజీవ్ రహదారిపై సిద్దిపేట జిల్లా పరిధిలో 148 బ్లాక్ స్పాట్లు గుర్తించారు. 2025 ఏడాది కాలంలో నేటి వరకు చూసుకుంటే ఈ రహదారి వెంట దాదాపు 490 ప్రమాదాలు చోటుచేసుకోగా, 240 మంది వరకు క్షతగ్రాత్రులు అయ్యారు. 450 మంది వరకు మృత్యువాత పడ్డారు. ఇటీవల మెదక్ జిల్లాలో సుమారు 200 వరకు ప్రమాదాలు జరగగా, 150 మంది వ రకు క్షతగ్రాతులు అయ్యారు. 250 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం.