అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం ఇటీవల కొత్త ఓటర్ల నమోదుతో పాటు మార్పులు, చేర్పులకు అవకాశమిచ్చింది. త్వరలోనే లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కొత్త ఓటర్ల ప్రక్రియ నమోదుకు మరోసారి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రకారం 18 ఏండ్లు నిండే యువతకు ఓటు హక్కు కల్పించడంతో పాటు మార్పులు, చేర్పులు చేపట్టనున్నది. ఈ నెల 20 నుంచి ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ప్రారంభించనున్నారు.
జనవరి 1, 2024 నాటికి 18 ఏండ్లు నిండేవారు కొత్తగా ఓటు నమోదుకు అర్హులని ఎన్నికల సంఘం పేర్కొంది. త్వరలోనే పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, పురపాలికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణ చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా 2024 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏండ్లు నిండే వారు ఓటురుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఓటర్ల నమోదుతోపాటు బోగస్ ఓట్ల తొలగింపు, చిరునామా మార్పు చేసుకోవచ్చు. ఇలా రూపొందించిన ఓటర్ల జాబితా తుది ప్రక్రియను ఫిబ్రవరి 8 నాటికి పూర్తి చేయనున్నది. ఓటు నమోదు కోసం బీఎల్‌ఓలతోపాటు ఆన్‌లైన్‌లోనూ పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఈ క్రమంలో 18 ఏండ్లు నిండిన యువత పేర్లు సేకరించేందుకు బీఎల్ఓలు ఇంటింటినీ సందర్శిస్తారు. కొత్తగా ఫారం-6 పూర్తిచేసి అందజేస్తే బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అలాగే ఓటరు గుర్తింపు కార్డు చిరునామా, తప్పుల సవరణకూ ఇందులో అవకాశం ఉంటుంది. ఓటరు జాబితాలతో పాటు పోలింగ్ కేంద్రాలను క్రమబద్ధీకరించనున్నారు. ఓటరు జాబితా సరవణ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో అధికారులు ఓటరు సవరణను పర్యవేక్షించనున్నారు. ఓటు నమోదుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గతంలో చేపట్టిన విధంగానే బూత్ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేలా ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టనున్నారు.
అర్హులైన యువత ఓటు నమోదు కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలతోపాటు యువత కళాశాలల్లోనే దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించనున్నారు. ఇందుకుగాను షెడ్యూల్ వ్యవధిలో ఏదో ఒక శని, ఆదివారాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. కొత్తవారి నమోదుతోపాటు మార్పులు, చేర్పులు, తొలగింపునకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తారు.
* జనవరి5 వరకు కొత్త దరఖాస్తుల స్వీకరణ, మార్పులు, చేర్పులకు అవకాశం.
* జనవరి 6న ఓటరు జాబితా ముసాయిదా ప్రకటన.
* జనవరి22 వరకు అభ్యంతరాల స్వీకరణ.
* జనవరి22 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఏదో ఒక శని, ఆదివారాల్లో ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ.
* ఫిబ్రవరి 2న అభ్యంతరాల పరిశీలన.
* ఫిబ్రవరి 8న తుది జాబితా ప్రకటన. ఏ ఫారం ఎందుకోసం?
* ఫారం-6 : కొత్తగా ఓటర్ల నమోదుకు ఫారం-6ను ఉపయోగించాలి. రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్ కార్డు(లేకుంటే నివాస ధ్రువీకరణ పత్రం) జతపర్చాలి.
* ఫారం-6ఏ : ఎన్ఆర్ఐలు ఫారం-6ఏను ఉపయోగించాలి. ఇందుకు తాము నివాసముంటున్న దేశంలో సిటిజన్ షిప్ లేదని, అక్కడి అంబాసిడర్‌తో డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
* ఫారం-7 : ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు కోసం ఫారం-7ను ఉపయోగించాలి. విచారించిన తర్వాత పేర్లు తొలగిస్తారు.
* ఫారం-8 : పేరు, పుట్టిన తేదీల్లో తప్పులను సవరించేందుకు ఫారం-8ను ఉపయోగించాలి. ఈ ఫారానికి సరి చేయాల్సిన పేరుకు సంబంధించిన డిక్లరేషన్, 10వ తరగతి మెమో లేదా డ్రైవింగ్ లైసెన్స్‌లలో ఏదో ఒకటి జతపర్చాలి.
* ఫారం-8ఏ : చిరునామా మార్చేందుకు ఫారం-8ఏను ఉపయోగించాలి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ అయిన వారు పూర్వ చిరునామాతో ఉన్న గుర్తింపు కార్డు జిరాక్స్, ప్రస్తుత చిరునామా ధ్రువీకరణ పత్రాన్ని జతచేస్తే సరిపోతుంది.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది పేర్లు గల్లంతు కావడం, జాబితాలో తప్పులు దొర్లడం, కుటుంబంలోనే ఒకరికి ఓ పోలింత్ బూత్‌లో, మరొకరికి మరో బూత్‌లో పేరు రావడంతో ఓటర్లు కొంత ఇబ్బంది పడ్డారు. కొంత మంది ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జాబితాలో పేర్లు లేనివారు, చిరునామా తప్పుగా ఉన్నవారు పోలింగ్ బూత్ మార్పుకోవాలన్నా సవరణకు అవకాశం ఉంది. ఈ నెల 20 నుంచి ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు కోవాలి.