గజ్వేల్, డిసెంబర్ 19: తప్పుడు సమాచారంతో అబద్ధ్దాలు మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి గజ్వేల్ ప్రజలకు, కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీకి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమయం ఇస్తే సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్‌లతో వస్తామని, అప్పుడైన గజ్వేల్‌లో ఎవరు గెలిచారో తెలుస్తుందని ఎద్దేవా చేశారు.
గజ్వేల్ నియోజకవర్గంలో 179 స్థానాలకు బీఆర్ఎస్ 92, కాంగ్రెస్ 68, బీజేపీ 5, ఇతరులకు 14స్థానాలు వచ్చాయన్నారు. కావాలంటే ఇంటెలిజెన్స్ ఆధారంగా వివరాలు తీసుకొని సీఎం మాట్లాడాలన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన తప్పుడు వివరాలతో తెలియక రేవంత్‌రెడ్డి ఏమీ మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదన్నారు. బీఆర్ఎస్ రెబల్స్‌తో తమకు మరో 25సీట్లు తగ్గాయని, లేకపోతే మరిన్ని సీట్లు వచ్చేవన్నారు. బీఆర్ఎస్ రెబల్స్‌తో రిమ్మనగూడ, మునిగడప. గొల్లపల్లి, దౌలాపూర్‌లో కాంగ్రెస్ గెలిచిందన్నారు. రేవంత్‌రెడ్డి సమయం ఇస్తే ఆయన ఇంటికైనా, లేక సెక్రటేరియల్ ముందు రోడ్ షో చేసేందుకు బీఆర్ఎస్ సర్పంచ్‌లతో వస్తామన్నారు.
ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్న రేవంత్‌రెడ్డిని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. అధికార పార్టీకి సుమారుగా 80శాతం స్థానాలు రావాలని, అలాంటిది రాష్ట్రంలో ఎక్కడా కనిపించలేదన్నారు. 50శాతం స్థానాల్లో ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారే గెలుపొందారన్నారు. దమ్ముంటే సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెండే మధు, నవాజ్ తదితరులు పాల్గొన్నారు.