సిద్దిపేట, జూలై 07(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లు డెడ్‌స్టోరేజీకి చేరాయి. ఈ రిజర్వాయర్లను గోదావరి జలాలతో నింపి చెరువులకు నీటిని విడుదల చేస్తే భూగర్భజలాలు పెరిగి గతేడాది తరహాలో పంటలు సాగుచేసుకోవచ్చని రైతులు ఆశపడుతున్నారు. ఇప్పటి వరకు భారీ వర్షాలు కురవక పోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో విత్తనాలు వేయగా అవి మట్టిలోనే వట్టిపోతున్నాయి. మరికొన్ని చోట్ల మొక్క లు ఎండి పోతున్నాయి. పెట్టిన పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరినాట్లు వేద్దామంటే నీళ్లులేక నార్లు ముదిరిపోతున్నదని రైతులు తెలుపుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో మండు టెండల్లో కాళేశ్వర జలాలను చెరువులకు విడుదల చేయడంతో నిండుకుండలా ఉండేవి. వర్షాకాలం ప్రారంభం కాగానే కొద్దిపాటి వర్షం కురిసినా చెరువులు నిండిపోయేవి. దీంతో సాగునీటి ఇబ్బందులు ఎదురుకాలేదు. గత వేసవిలో కాళేశ్వర జలాలను విడుదల చేయక పోవడంతో సిద్దిపేట జిల్లాలో చెరువులు ఎండి భూగర్భ జలాలు అడుగంటాయి. ప్రస్తుతం జిల్లాలోని రిజర్వాయర్ల పరిస్థితి ఆశాజనంగా లేకపోవడంతో వానకాలం సాగుపై రైతుల్లో ఆశలు అడుగంటుతున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో గోదావరి జలాలతో కళకళలాడిన రిజర్వాయర్లు నేడు నీళ్లు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల సరిహద్దులోని అన్నపూర్ణ రిజర్వాయర్ సామర్థ్యం 3.5 టీఎంసీల కాగా, ప్రస్తుతం ఇందులో 0.73 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. సిద్దిపేట జిల్లా కేంద్రానికి అనుకుని ఉన్న రంగనాయకసాగర్ రిజర్వాయర్ సామర్ధ్యం 3 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 0.69 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. తోగుట మండలంలోని మల్లన్నసాగర రిజర్వాయర్ సామర్ధ్యం 50 టీఎంసీలు కాగా, ఇందులో ప్రస్తుతం 8. 849 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి.మర్కూక్ మండలంలోని కొండ పోచమ్మ రిజర్వాయర్ సామర్ధ్యం 15 టీఎంసీలు కాగా, ఇందులో ప్రస్తుత నీటి మట్టం 4.75 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలోని ప్రధాన మధ్యతరహా శనిగరం ప్రాజెక్టు నీటి సామ ర్ధ్యం 1.092 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందులో 0.463 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. గతేడాది ఇదే సమయంలో అన్ని రిజర్వాయర్లు నిం డుగా ఉండి అవసరాన్ని బట్టి చెరువులకు నీటిని విడుదల చేసేలా బీఆర్ఎస్ ప్రభుత్వం గోదావరి జలాలతో నింపి పెట్టింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయకపోవడంతో అన్నదాతకు కష్టకాలం దాపురించింది.
సిద్దిపేట జిల్లాలోని ప్రధాన కాల్వలతో పాటు మైనర్ కాల్వల్లో మట్టి, పిచ్చి చెట్లు విపరీతంగా పెరిగి పోయా యి. కనీసం కాల్వలను క్లీన్ చేద్దామనే అలోచన కూడా ప్రభుత్వానికి రావడం లేదు. సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు. వర్షాలు పడితే కాల్వల ద్వారా నీళ్లు ఎట్లా పోతాయి అనే ఆలోచన వారికి రావడం లేదు. ఇటీవల సిద్దిపేట జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఈ విషయమై ప్రధాన అంశంగా చర్చించారు. వెంటనే కాల్వలో పూడికతీత పనులు పూర్తి చేయాలని సూచించారు. పిచ్చి మొక్కలను తొలిగించాలని నీటి పారుదల శాఖ అధికారులను కోరారు. ఈ అంశంపై ప్రత్యేకంగా నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మను చౌదరిని కోరారు. కానీ, ఆ దిశగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టడం లేదు. కాల్వలు మట్టితో పూడుకపోయి కనిపిస్తున్నాయి.