పుల్కల్, ఆగస్టు 17: వర్షాకాలం తర్వాత రూ.168 కోట్లతో సింగూరు కాలువల సీసీ లైనింగ్ పనులు చేపడతామని, ప్రాజెక్టు మరమ్మతుల కోసం రూ.16 కోట్లు మంజూరైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా ఇసోజిపేట గ్రామ శివారులో భారీ వర్షానికి శనివారం సింగూరు కెనాల్ కాలువకు గండిపడడంతో ఆదివారం కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పారితోష్ పంకజ్‌తో కలిసి ట్రాక్టర్లో కాలువ వద్దకు వెళ్లి మంత్రి దామోదర రాజనర్సింహ పరిశీలించారు.
వెంటనే కాల్వకు మరమ్మతులు చేపట్టాలని, సాగునీరు వృథా కానీయవద్దని ఇరిగేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు.అక్కడి నుంచి నేరుగా సింగూరు ప్రాజెక్టుకు చేరుకుని పరిశీలించారు. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో వివరాలు ప్రాజెక్టు డీఈ నాగరాజును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాజెక్టు వద్ద మీడియాతో మంత్రి మాట్లాడారు.
ప్రాజెక్టుపై వస్తున్న వార్తల విషయంలో నేషనల్ అథారిటీ డ్యామ్ సేప్టీ అధికారులు సూచించిన మేరకు రివిట్మెంట్ విషయంలో ప్రభుత్వం పర్మినెంట్ సొల్యూషన్కు ఆలోచిస్తున్నదని మంత్రి వెల్లడించారు. ప్రాజెక్టు పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మంత్రి వెంట ఆర్డీవో పాండు, ఈఈ భీమ్, తహసీల్దార్ కృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దుర్గారెడ్డి, నాయకులు లక్ష్మారెడ్డి, గోవర్ధన్, సంగమేశ్వర్ గౌడ్, బోయిని శ్రీనివాస్,యూత్ అధ్యక్షుడు ఉదయ్ కుమార్, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు ఇమ్రాన్ ఉన్నారు.