హుస్నాబాద్, మే 1: భక్తుల పాలిట కొంగుబంగారంగా, కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా ఉత్తర తెలంగాణలోనే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు ప్రారంభమ య్యాయి. ఈనెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. కాకతీయుల కాలంలో నిర్మాణమైన ఈ దేవాలయంలోని అమ్మవారిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుందని, కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్మకం. భక్తుల పాలిట కొంగుబంగారంగా ఉన్న ఎల్లమ్మతల్లిని దర్శించుకునేందుకు హుస్నాబాద్ పట్టణం, మండలం నుంచే కాకుండా సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల నుంచి, ఇతర రాష్ర్టాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు.
ఆలయానికి జాతర సమయంలోనే కాకుండా ఇతర రోజుల్లోనూ అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. భక్తులకు అనుకూలంగా ఉండేలా ఆలయానికి కొత్తరూపు వచ్చేలా అనివేటి మండపం నిర్మించాలనే సంకల్పంతో అప్పటి ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ దేవాదాయశాఖ నుంచి రూ.50లక్షలు మంజూరు చేయించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ 3మార్చి 2024న శంకుస్థాపన చేశారు. మంత్రి శంకుస్థాపన చేసి రెండేండ్లు దాటినా మండప నిర్మాణం పూర్తి కాకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు బోనాలు పెట్టుకునేందుకు, పట్నాలు వేసుకునేందుకు అనువుగా ఉండే అనివేటి మండపం పనులు పూర్తి చేయించడంలో ఆలయ అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆలయానికి శాశ్వత కమిటీ ఏర్పాటు లేకున్నా కనీసం ఉత్సవ కమిటీ కూడా ఇప్పటి వరకు నియామకం చేయకపోవడం గమనార్హం. జాతర ఏర్పాట్లు, భక్తులకు సౌకర్యాల కల్పన తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకొని జాతర సజావుగా జరిగేలా కమిటీ ఏర్పాటు చేయాల్సిన స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అలా చేయక పోవడం వల్ల అధికారులు ఇష్టారాజ్యంగా టెండర్లు, వ్యయ టెండర్లు నిర్వహిస్తున్నారని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు.
హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ తన సొంత ఖర్చులతో ఎల్లమ్మ ఆలయ ఆవరణలోనే కొత్తగా పోచమ్మ దేవాలయం నిర్మిస్తున్నారు. దీని నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది.భక్తుల కోసం మూడు షెడ్లను సైతం నిర్మాణం చేయిస్తున్నారు. ఆలయ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణం కూడా మంత్రి సొంత నిధులతో పూర్తి చేయించారు.
ఆలయ అనివేటి మండప నిర్మాణ పను లు కొనసాగుతున్నాయి. షాపింగ్ కాంప్లెక్స్‌కు టెండర్లు పెట్టినా ఎవరూ రాలేదు. దీంతో ఖాళీగా ఉంచాల్సి వస్తోంది. ఉత్సవాలు మే 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో పోచమ్మ దేవాలయం, షెడ్ల నిర్మాణం పూర్తవుతోంది. ఈసారి జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆమె కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాను. పై అధికారుల ఆదేశాల మేరకు ఉత్సవ కమిటీని ప్రకటిస్తాం.
– కిషన్‌రావు, ఆలయ కార్యనిర్వహణ అధికారి, హుస్నాబాద్, (సిద్దిపేట జిల్లా)